: ఏపీలో హైటెక్ పాలన... త్వరలోనే వారంలో 5 రోజులే పనిదినాలు!
నవ్యాంధ్రప్రదేశ్ లో త్వరలోనే హైటెక్ పాలన అమల్లోకి రానుంది. నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతి నుంచే పూర్తి స్థాయి పరిపాలనను నిర్వహించాలని భావిస్తున్న ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు... జూన్ నాటికి మొత్తం అన్ని శాఖలను అమరావతికి తరలించాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలో అమరావతిలో పూర్తి స్థాయిలో భవన నిర్మాణాలు లేకపోవడం, నివాస గృహాలకు ఉన్న కొరత దృష్ట్యా ఉద్యోగులు సరికొత్త ప్రతిపాదనను తెరపైకి తీసుకొచ్చారు. ఇప్పటికిప్పుడు అమరావతికి తరలిరావడానికి తాము సిద్ధంగానే ఉన్నామని చెప్పిన అధికారులు... వారానికి ఐదు రోజుల పనిదినాల విధానాన్ని అమల్లోకి తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరారు. దీనిపై ఉన్నతాధికారులతో సమీక్షించిన సీఎం చంద్రబాబు సానుకూలంగా స్పందించారు. పనిదినాలు తగ్గిపోతున్న క్రమంలో కొన్ని గంటల పాటు అదనపు పనిచేస్తే సరిపోతుందని ఆయన భావిస్తున్నారు. ఇందుకోసం సదరు అదనపు పనిని ఉద్యోగులు ఇంటి నుంచే చేసేలా ప్రతిపాదించారు. దీనిపై ప్రామాణికత, మార్గదర్శకాలపై కసరత్తు చేయాలని ఆయన ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వెరసి వారానికి ఐదు రోజుల పనిదినాల విధానం అమల్లోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం దాదాపుగా నిర్ణయం తీసుకుంది. అంటే, ఏపీలో హైటెక్ తరహా పాలన త్వరలోనే అమల్లోకి రానుందన్న మాట.