: జగన్ కేసులో... ఈడీకి ఝలక్కిచ్చిన సీబీఐ కోర్టు!


ఏపీలో ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తనపై నమోదైన అక్రమాస్తుల కేసులతో సతమతమవుతున్నారు. ప్రతి శుక్రవారం కోర్టు విచారణకు హాజరుకావాల్సిన పరిస్థితుల్లో ఆయన తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో సీబీఐతో పాటు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఆయనపై ముప్పేట దాడికి దిగింది. ఇప్పటికే ఆయన కుటుంబం ఆధ్వర్యంలోని ‘సాక్షి’ దినపత్రిక ఆస్తులను అటాచ్ చేసిన ఈడీ, కేసు దర్యాప్తులో వేగం పెంచింది. అయితే నిన్న నాంపల్లిలోని సీబీఐ ప్రత్యేక కోర్టులో జరిగిన విచారణ సందర్భంగా ఈడీకి షాక్ తగిలింది. మనీలాండరింగ్ కేసులను ఇప్పటికిప్పుడే ఆర్థిక నేరాల కోర్టుకు బదిలీ చేయలేమని చెప్పిన సీబీఐ కోర్టు... అన్నిటినీ కలిపి ఒకేసారి బదిలీ చేస్తామని చెప్పింది. జగన్ సంస్థ జగతి పబ్లికేషన్స్ లో పారిశ్రామికవేత్తలు మాధవ్ రామచంద్రన్, ఏకే దండమూడి, టీఆర్ కన్నన్ లు పెట్టిన రూ.34.66 కోట్ల పెట్టుబడులు మనీలాండరింగ్ చట్టాలకు వ్యతిరేకంగానే జరిగాయన్నది అటు సీబీఐతో పాటు ఇటు ఈడీ వాదన. ఈ ముగ్గురి పెట్టుబడులకు సంబంధించి సీబీఐ కోర్టులో దాఖలైన చార్జిషీట్లను తీసుకున్న ఈడీ... వాటిని ఆర్థిక నేరాల కోర్టుకు బదిలీ చేయాలని సీబీఐ ప్రత్యేక కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. నిన్నటి విచారణ సందర్భంగా దీనిపై జగన్ తరఫు న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇప్పటికే కేసు ఒకటే అయినా, వివిధ వ్యక్తులు, సంస్థల పేరు చెప్పి సీబీఐ 11 చార్జిషీట్లు దాఖలు చేసిందని ఆయన వాదించారు. తాజాగా ఈడీ కూడా విడతలవారీగా చార్జిషీట్లు దాఖలు చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లుగా కనిపిస్తోందని ఆరోపించారు. ఈ వాదనతో ఏకీభవించిన సీబీఐ కోర్టు... చార్జిషీట్లన్నీ దాఖలు చేశాకే, కేసుల బదలాయింపునకు సంబంధించి పిటిషన్ వేసుకోవాలని ఈడీ అధికారులకు సూచించింది. అప్పటిదాకా కేసులను ఆర్థిక నేరాల కోర్టుకు బదలాయించడం కుదరదని తేల్చిచెప్పింది.

  • Loading...

More Telugu News