: కోర్టు ఆవరణలోనే జగన్ ‘సేవ్’ మంతనాలు!... పార్టీ ఎమ్మెల్యేలతో చర్చలు
ఏపీలో అధికార టీడీపీ చేపట్టిన ‘ఆకర్ష్’ మంత్రానికి ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సతమతమైపోతున్నారు. ఇప్పటికే అందుబాటులోని పలువురు పార్టీ నేతలు, ప్రధానంగా ఎమ్మెల్యేలతో నిత్యం టచ్ లోనే ఉన్న జగన్... నిన్న ఓ ఆసక్తికర సన్నివేశానికి తెర తీశారు. అక్రమాస్తుల కేసులో నిన్న హైదరాబాదు, నాంపల్లిలోని సీబీఐ కోర్టుకు హాజరైన ఆయన తన పార్టీ ఎమ్మెల్యేలను అక్కడికే పిలిపించుకున్నారు. ఏకంగా కోర్టు ఆవరణలోనే వారితో ఆయన మంతనాలు జరిపారు. సాధారణంగా కోర్టు విచారణ ఉన్న రోజున ఉదయం 10 గంటలకు కోర్టుకు వస్తే, ఇక ఆ రోజు సాయంత్రం వరకు ఆయన విచారణ నిమిత్తం అక్కడ ఉండాల్సి వస్తుంది. దీంతో నిన్న కోర్టులోనే ఆయన మంతనాల పర్వానికి తెర తీశారు. పార్టీ మారతారని ప్రచారంలో ఉన్న గుంటూరు, ప్రకాశం జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలను జగన్ సమీప బంధువు బాలినేని శ్రీనివాసరెడ్డి వెంటబెట్టుకుని మరీ కోర్టు వద్దకు వచ్చారు. వారిలో పోతుల రామారావు (కందుకూరు), గొట్టిపాటి రవికుమార్ (అద్దంకి), జంకె వెంకటరెడ్డి (మార్కాపురం), పాలపర్తి డేవిడ్ రాజు (యర్రగొండపాలెం) ఉన్నారు. న్యాయవాదులు, కక్షిదారులు, పోలీసులతో నిత్యం కిటకిటలాడే సదరు కోర్టు ఆవరణలోనే ఓ మూలన వారితో జగన్ చర్చలు జరిపారు. ఇదిలా ఉంటే, జగన్ నుంచి పిలుపు ఉన్నప్పటికీ ఆదిమూలపు సురేశ్ (సంతనూతలపాడు) ఈ భేటీకి డుమ్మా కొట్టినట్లు సమాచారం. కోర్టు ఆవరణలోనే జగన్ నిర్వహించిన ఈ భేటీపై అక్కడున్న వారంతా ఆసక్తిగా చర్చించుకున్నారు.