: ఆర్థిక సర్వే తరువాత బడ్జెట్ పై ఆశలు... కొనుగోళ్ల వెల్లువతో లాభాలు
ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పార్లమెంట్ ముందు ఉంచిన ఆర్థిక సర్వే ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ను పెంచింది. ఎకనామిక్ సర్వే వివరాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తుంటే, అప్పటివరకూ ఫ్లాట్ గా సాగిన స్టాక్ మార్కెట్ సూచికలు నెమ్మదిగా పైకి లేచాయి. మధ్యాహ్నం 12 గంటల సమయంలో క్రితం ముగింపుకన్నా 50 పాయింట్లు లాభంలో ఉన్న సెన్సెక్స్, ఆపై 120 పాయింట్లకు పైగా పెరిగింది. శుక్రవారం నాటి సెషన్ ముగిసేసరికి బీఎస్ఈ సెన్సెక్స్ సూచిక 178.30 పాయింట్లు పెరిగి 0.78 శాతం లాభంతో 23,154.30 పాయింట్ల వద్దకు, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచిక నిఫ్టీ 59.15 పాయింట్లు పెరిగి 0.85 శాతం లాభంతో 7,029.75 పాయింట్ల వద్దకు చేరాయి. బీఎస్ఈలో మిడ్ క్యాప్ 0.30 శాతం లాభపడగా, స్మాల్ క్యాప్ 0.45 శాతం నష్టపోయింది. ఎన్ఎస్ఈ-50లో 38 కంపెనీలు లాభాలను నమోదు చేశాయి. కోల్ ఇండియా, హిందాల్కో, ఎస్బీఐ, వీఈడీఎల్, ఎన్టీపీసీ తదితర కంపెనీలు లాభపడగా, బజాజ్ ఆటో, హీరో మోటోకార్ప్, లుపిన్, భారతీ ఎయిర్ టెల్, ఐడియా తదితర కంపెనీల ఈక్విటీలు నష్టపోయాయి. బీఎస్ఈలో మొత్తం 2,653 కంపెనీల ఈక్విటీలు ట్రేడ్ కాగా, 1,041 కంపెనీలు లాభాల్లోను, 1,443 కంపెనీల ఈక్విటీలు నష్టాల్లోనూ నడిచాయి. గురువారం నాటి సెషన్ ముగింపు సమయంలో రూ. 86,14,175 కోట్లుగా ఉన్న బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ కాప్ నేడు రూ. 86,34,614 కోట్లకు పెరిగింది.