: నా కథ బెజవాడలోనూ తెలుసు, హైదరాబాద్ లోనూ తెలుసు: పోలీసులతో హీరోయిన్ స్వాతిరెడ్డి
తాను సంపాదిస్తున్న డబ్బుపై తప్ప తనపై తన తల్లి నాగేంద్రమ్మకు, సోదరుడికి ప్రేమ లేదని హీరోయిన్ స్వాతిరెడ్డి పోలీసులకు ఇచ్చిన స్టేట్ మెంట్ లో వెల్లడించింది. తనకు కూతురంటే భయమని నాగేంద్రమ్మ చెప్పిన మాటలు బూటకమని స్వాతిరెడ్డి చెబుతోంది. తన కథ, సినిమాల్లో చాన్సుల కోసం పడ్డ కష్టాలు బెజవాడలో పది మందికీ తెలుసునని, హైదరాబాద్ లో పది మందికీ తెలుసునని అంది. తన సోదరుడికి సొంత సంపాదనతో పెళ్లి చేశానని, తానంటే భయపడే తల్లి తనకు సిగరెట్ వెలిగించి, మందు కలిపి ఎందుకు ఇస్తుందని ఎదురు ప్రశ్నించిన స్వాతి, అందుకు సాక్ష్యం చూపాలా? అని పోలీసులనే ప్రశ్నించింది. కాగా, శ్రీనివాసరెడ్డిది గుంటూరని, అతను మోసగాడని, ఈ విషయంలోనే పోలీసులను ఆశ్రయించానని నాగేంద్రమ్మ తెలిపారు. తన పాపంటే ఎంతో ప్రేమ ఉందని, ఆమెను కంటికి రెప్పలా కాపాడుకుంటున్నానని చెప్పింది. సినిమా అవకాశాలు ఎన్నో వస్తున్న వేళ, శ్రీనివాస్ మోసం చేశాడని ఆరోపించారు. తాను ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదని, శ్రీనివాస్ ను కనీసం విచారించలేదని తెలిపారు. ఈ కేసులో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారా? లేదా? అన్న విషయం ఇంకా వెల్లడి కాలేదు.