: పోలీస్ స్టేషన్ కు చేరిన హీరోయిన్ స్వాతిరెడ్డి ప్రేమ కథ.. తల్లి నాగేంద్రమ్మను కొట్టిన స్వాతి
హీరోయిన్ స్వాతిరెడ్డి (లవ్ ఫేం) ప్రేమ కథ పోలీస్ స్టేషన్ గడప తొక్కింది. తాను ఇష్టపూర్వకంగానే శ్రీనివాస్ రెడ్డి అనే అతనిని ప్రేమించానని స్వాతిరెడ్డి చెబుతుండగా, శ్రీనివాస్ కు అంతకుముందే పెళ్లయిందని, పిల్లలున్నారని తల్లి నాగేంద్రమ్మ ఫిర్యాదు చేశారు. తన కుమార్తెను బలవంతంగా తీసుకువెళ్లాడని, మాయమాటలు చెప్పి నగదు, నగలు అపహరించాడని బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో స్వాతిరెడ్డిని పోలీసులు పిలిపించగా, ఆమె స్టేషన్ లోనే తన తల్లిపై చెయ్యి చేసుకోవడం సంచలనం కలిగించింది. తన తల్లి, సోదరుడు తనను వాడుకుంటున్నారని ఈ సందర్భంగా ఆమె ఆరోపించింది. తాను మద్యం సేవిస్తానని, సిగరెట్లు కాలుస్తానని పోలీసుల ముందు నిర్భయంగా చెప్పిన స్వాతి, వారే మందు కలిపిస్తారని, సిగరెట్ ను అంటిస్తారని వ్యాఖ్యానించింది. తాను ఇష్టపూర్వకంగానే శ్రీనివాస్ తో ఉంటున్నట్టు చెప్పింది. దీంతో ఆమె స్టేట్ మెంట్ ను రికార్డు చేసిన పోలీసులు, కేసు నమోదు చేసుకున్నారు.