: ఫిరాయింపులను ఆపేదెలా..?: ఎమ్మెల్యేలతో జగన్ మరో సమావేశం
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశంలోకి జరుగుతున్న వలసలను ఆపేందుకు జగన్ తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. తమ పార్టీలోకి 30 మంది వరకూ ఎమ్మెల్యేలు రానున్నారని స్వయంగా తెలుగుదేశం నేతలు చెబుతూ, మైండ్ గేమ్ ఆడుతున్న నేపథ్యంలో జగన్ జిల్లాలవారీగా ఎమ్మెల్యేలతో సమావేశమవుతున్నారు. నిన్న కడప జిల్లా నేతలతో సమావేశమై చర్చించిన ఆయన, నేడు గుంటూరు, ప్రకాశం జిల్లాల నేతలతో సమావేశం అవుతున్నారు. ఈ మేరకు ఎమ్మెల్యేలను హైదరాబాద్ కు రావాలని ఆయన ఆదేశించారు. నేటి సాయంత్రం నేతలతో సమావేశమయ్యే ఆయన, వలసలను ఆపడంపైనే ప్రధానంగా దృష్టిని సారించారు. ఎమ్మెల్యేల సమస్యలు, తెలుగుదేశం పార్టీ నేతల నుంచి వస్తున్న ఒత్తిళ్లపై ఆయన అడిగి తెలుసుకోనున్నట్టు సమాచారం.