: మోదీ సర్కారుకు ఝలక్... మహిషాసుర ఉత్సవాలు జరిపాం: బీజేపీ ఎంపీ ఉదిత్ రాజ్
ఓ వైపు దసరా పర్వదినాలపై, అందునా 'మహిషాసురమర్ధనం'పై దేశవ్యాప్తంగా చర్చ, ఆపై ప్రభుత్వ, విపక్షాల మధ్య ఆరోపణల తీవ్రత పెరుగుతుండగా, అగ్నికి ఆజ్యం పోసేలా, బీజేపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు చేశారు. అన్ని కులాలనూ గౌరవించే వ్యక్తిగా, గతంలో జవహర్ లాల్ నెహ్రూ యూనివర్శిటీలో జరిగిన మహిషాసుర ఉత్సవాల్లో పాల్గొన్నానని ఉదిత్ రాజ్ వెల్లడించారు. 2011 నుంచి వర్శిటీలో అక్టోబర్ నెలలో ఈ ఉత్సవాలు జరుగుతూనే ఉన్నాయని అన్నారు. జేఎన్యూ పూర్వ విద్యార్థిగా తాను పాల్గొన్నానని, ఎందుకంటే, కుల వివక్ష అనేది చెడ్డదని తాను నమ్ముతానని చెప్పుకొచ్చారు. అప్పట్లో తాను ఉద్యమకారుడినని, అయితే ఎల్లకాలం ఒకే అభిప్రాయాలతో ఉండలేమని, అందుకే ఆ తర్వాత తాను మారానని చెప్పారు. అలా మారలేని వారు మృతులతో సమానమని అన్నారు. కాగా, మహిషాసుర పూజలను ప్రస్తావిస్తూ, కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ చేసిన ప్రసంగం ప్రకంపనలు పుట్టిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఉదిత్ రాజ్ వ్యాఖ్యలు ఇంకెంత వేడిని పుట్టిస్తాయో!