: హఫీజ్ సయీద్ పక్కనే రాహుల్ గాంధీ, ప్రధాని మోదీ కూడా... అమృత్ సర్ లో పోస్టర్ల కలకలం


పాకిస్థాన్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఉగ్రవాద సంస్థ జమాత్ ఉద్ దవాకు హఫీజ్ సయీద్ చీఫ్... ఇక భారత్ లో కాంగ్రెస్ పార్టీకి ఉపాధ్యక్షుడిగా రాహుల్ గాంధీ... కేంద్రంలో బీజేపీ సర్కారు అధిపతి హోదాలో ప్రధాని నరేంద్ర మోదీ... వీరు ముగ్గురికి సంబంధించిన పోస్టర్లు పంజాబ్ లోని అమృత్ సర్ లో కలకలం రేపుతున్నాయి. వీటిని ఎవరో ఉగ్రవాదులు అంటించిన పోస్టర్లు అనుకుంటే తప్పులో కాలేసినట్లే. ఎందుకంటే, దేశభక్తిలో మేం గొప్ప అంటే.. కాదు మేం గొప్ప అంటూ వాదులాడుకుంటున్న కాంగ్రెస్, బీజేపీ నేతలే వీటిని అంటించి పెద్ద చర్చకే తెర తీశారు. రీసెర్చి స్కాలర్ రోహిత్ వేముల ఆత్మహత్యతో హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటీ, పార్లమెంటు దాడి సూత్రధారి అఫ్జల్ గురుకు అనుకూలంగా ర్యాలీతో ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీలు ఉద్రిక్తంగా మారాయి. ఈ నేపథ్యంలో కేంద్రంలో అధికార, విపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో పెద్ద రాద్ధాంతమే నడుస్తోంది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ తరపున వకాల్తా పుచ్చుకున్న చందంగా రాహుల్ గాంధీ మాట్లాడుతున్నారంటూ కొందరు బీజేపీ కార్యకర్తలు... రాహుల్ గాంధీ, హఫీజ్ సయీద్ లు పక్కపక్కనే ఉన్నట్లు తయారు చేసిన పోస్టర్లను అమృత్ సర్ లో అంటించారు. దీనిపై సమాచారం అందుకున్న మరుక్షణమే కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా రంగప్రవేశం చేశాయి. హఫీజ్ సయీద్, ప్రధాని నరేంద్ర మోదీ పక్కపక్కనే ఉన్నట్లు పోస్టర్లు తయారు చేసి గోడలపై అంటించేశారు. ప్రస్తుతం ఈ రెండు రకాల పోస్టర్లు అక్కడ కలకలం రేపుతున్నాయి.

  • Loading...

More Telugu News