: హైదరాబాద్, ముంబయ్, ఢిల్లీ కన్నా చెన్నైనే సురక్షిత నగరం: మెర్చర్ గ్లోబల్ సర్వే
దేశంలోని సురక్షిత నగరాల జాబితాలో చెన్నై నగరం ముందు వరసలో నిలిచింది. హైదరాబాద్, ఢిల్లీ, ముంబయి, బెంగళూరు సహా ఏడు నగరాలతో పోల్చుకుంటే చెన్నై నగరమే అత్యుత్తమమని 'మెర్చర్ గ్లోబల్ కన్సల్టెన్సీ' సంస్థ జరిపిన సర్వేలో తేలింది. ఇందుకు ప్రధాన కారణం తక్కువ స్థాయిలో నేరాలు, శాంతి భద్రతల నిర్వహణ అంశాలు మొదలైనవని పేర్కొంది. దేశంలోని ఇతర నగరాల్లో జరుగుతున్న తీవ్రవాద చర్యలు, అల్లర్లు, హింసాకాండలతో పోల్చుకుంటే చెన్నై అటువంటి పరిస్థితులకు చాలా దూరంగా ఉందని వెల్లడైందని ఆ సంస్థ అధిపతి రుచ్చికాపాల్ తెలిపారు. చెన్నై వాసులు చట్టానికి, న్యాయానికి లోబడి ప్రశాంతమైన జీవనం గడుపుతున్నారని మెచ్చుకున్నారు. అంతేగాక విద్యా సదుపాయాలు, రవాణా సౌకర్యాలు, మెట్రోరైలు సేవలు ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందిస్తున్నాయని చెప్పారు. మొత్తం ప్రపంచవ్యాప్తంగా 230 నగరాలను ఎంపిక చేసి సర్వే నిర్వహించగా సురక్షితమైన నగరాల్లో చెన్నైకు 113వ స్థానం దక్కిందన్నారు. నాణ్యమైన జీవన పరిస్థితులున్న నగరాల్లో నాలుగో స్థానం, మెరుగైన నగరవాసులున్న ప్రాంతంగా 150వ స్థానం పొందిందని తెలిపారు.