: విపక్షాల చేతిలో ఓ అస్త్రం... స్మృతి సారీ చెప్పకుంటే స్తంభనే!


ఏదైనా బలమైన కారణాన్ని చూపి పార్లమెంట్ ను అడ్డుకోవాలన్న కాంగ్రెస్ కు, కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతీ ఇరానీ చేసిన వ్యాఖ్యలు కలిసొచ్చాయి. హిందువులు పూజించే దుర్గామాతను ఎవరో ఏదో అన్నారని, ఆ వ్యాఖ్యలనే పార్లమెంటు ముందు ప్రస్తావించడం, 'మహిషాసురుడిని హతమార్చేందుకు దుర్గమ్మ వ్యభిచారిగా మారింది' అని ఓ కాగితంలో రాసున్న పదాలను బిగ్గరగా చదవడంపై కాంగ్రెస్ తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది. ఆపై హైదరాబాద్ లో రోహిత్ వేముల ఆత్మహత్య విషయమై సభను తప్పుదారి పట్టించారని ఆరోపిస్తూ, నేటి సభను స్తంభింపజేయాలని నిర్ణయించింది. స్మృతీ ఇరానీ క్షమాపణ చెప్పేంతవరకూ సభా కార్యకలాపాలను అడ్డుకుని తీరుతామని ఆ పార్టీ నేతలు స్పష్టం చేశారు. మరోవైపు రోహిత్ ఆత్మహత్య విషయంలో తెలంగాణ ప్రభుత్వ వైఫల్యాలను స్మృతి ఎత్తిచూపడంతో, టీఆర్ఎస్ పార్టీ సైతం ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ఆత్మహత్య తరువాత మరుసటి రోజు ఉదయం 6:30 గంటల వరకూ పోలీసులను వర్శిటీలోకి అనుమతించలేదని స్మృతి చెప్పగా, ముఖ్యమంత్రి కార్యాలయం దాన్ని ఖండిస్తూ ఓ ప్రకటన వెలువరించింది. అక్కడ డాక్టర్లు కూడా లేరని స్మృతి చెప్పగా, ఆత్మహత్య విషయం తెలిసిన నిమిషాల్లో డాక్టర్ వచ్చారని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. లోక్ సభలో పరిస్థితి ఇలా వుండగా, రాజ్యసభలోనూ విపక్ష సభ్యులు బీజేపీని ఇరుకున పెట్టాలని నిర్ణయించారు. మరో మూడు రోజుల్లో వార్షిక బడ్జెట్ పార్లమెంట్ ముందుకు రానున్న వేళ, ఈ పరిస్థితి బీజేపీకి ఇబ్బందికరమే.

  • Loading...

More Telugu News