: ‘దాయాదీ పోరు’కు లైన్ క్లియర్...టీ20 వరల్డ్ కప్ కు జట్టును పంపేందుకు పాక్ ఓకే!
‘పొట్టి’ ప్రపంచ కప్ లో ‘దాయాదీ పోరు’ ఉంటుందో? లేదోనన్న అనుమానాలు నిన్నటిదాకా క్రికెట్ లవర్స్ ను కలవరానికి గురి చేశాయి. ఎందుకంటే, టీ20 వరల్డ్ కప్ భారత్ లో జరుగుతున్న నేపథ్యంలో... పాకిస్థాన్ క్రికెట్ జట్టును భారత్ కు పంపే విషయంలో ఆ దేశ ప్రభుత్వం డైలమాలో పడిపోయింది. ఇరుదేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భారత్ లో పాక్ జట్టు పర్యటన అంత శ్రేయస్కరం కాదన్న కోణంలో ఆలోచించిన పాక్ ప్రభుత్వం దీనిపై నిర్ణయాన్ని చాలాకాలం పాటే వాయిదా వేసింది. ఈ క్రమంలో టీ20 వరల్డ్ కప్ లో ‘దాయాదీ పోరు’గా వినుతికెక్కిన భారత్, పాక్ జట్ల మధ్య మ్యాచ్ ఉండదేమోనన్న వార్తలు వెలువడ్డాయి. భారత్ కు జట్టును పంపే విషయంలో కాస్తంత సానుకూలంగా ఆలోచించాలన్న పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) లేఖకు ఆ దేశ ప్రభుత్వం నిన్న గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఈ మేరకు ఈ విషయాన్ని నిన్న పీసీబీ చీఫ్ షహర్యార్ ఖాన్ అధికారికంగా ప్రకటించారు. టీ20 వరల్డ్ కప్ లో తమ జట్టు పాల్గొంటుందని ఆయన ప్రకటించారు. అంటే, పొట్టి ప్రపంచ కప్ లో ‘దాయాదీ పోరు’కు లైన్ క్లియరైనట్టేనన్నమాట.