: ‘యునైటెడ్ స్పిరిట్స్’ చైర్మన్ పదవికి మాల్యా రాజీనామా!... రూ.515 కోట్లు కొట్టేసిన లిక్కర్ కింగ్


‘బీరు’ బ్రాండ్ (కింగ్ ఫిషర్) పేరిటే విమానయాన సంస్థ. ఆపై నాన్ స్టాఫ్ విలాసాలతో చైర్మన్ అండ్ ఫ్యామిలీ బిజీబిజీ. వెరసి అప్పటిదాకా విజయవంతమైన పారిశ్రామిక సంస్థగా కొనసాగిన ‘యునైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్’... ఆ తర్వాత ఉద్దేశపూర్వక ఎగవేతదారు(విల్ ఫుల్ డిఫాల్టర్)గా అప్రతిష్ఠ మూటగట్టుకుంది. పెను భారంగా మారిన యూఎస్ఎల్ ను ఆ సంస్థ చైర్మన్... లిక్కర్ కింగ్ గా పేరుగాంచిన విజయ్ మాల్యా బ్రిటన్ సంస్థ డియాజియోకు అమ్మేశారు. సంస్థనైతే అమ్మేశారు కాని, ఆ సంస్థ చైర్మన్ పదవి నుంచి దిగిపోయేందుకు మాత్రం మాల్యా ససేమిరా అన్నారు. దీంతో అసలే నష్టాల్లో ఉన్న కంపెనీని కొనుగోలు చేశామని బాధపడుతున్న డియాజియో... మాల్యా మంకుపట్టుతో తల పట్టుకుంది. విడతలవారీగా జరిగిన చర్చల ఫలితంగా ఎట్టకేలకు డియాజియో రాయబారం ఫలించింది. మాల్యా యూఎస్ఎల్ చైర్మన్ పదవి నుంచి నిన్న తప్పుకున్నారు. నిన్నటిదాకా పదవి నుంచి దిగేది లేదని తేల్చిచెప్పిన మాల్యా, అంత త్వరగా డియాజియోకు అనుకూలంగా వ్యవహరించడం వెనుక ఖరీదైన ‘డీల్’ ఉందట. కంపెనీ చైర్మన్ పదవి నుంచి దిగిపోయేందుకు మాల్యాకు డియాజియో ఏకంగా రూ.515 కోట్లను ముట్టజెప్పింది. అంతేకాదు, చైర్మన్ గా దిగిపోయిన ఆయనను ఇకపై కంపెనీ ‘చైర్మన్ ఎమెరిటస్’గా కొనసాగించేందుకు ఒప్పుకుంది. ఇక యూబీఎల్ ఆధ్వర్యంలోని ఐపీఎల్ జట్టు ‘రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు’ జట్టుకు మాల్యాను మెంటార్ గానే కొనసాగించడంతో పాటు ఆయన సుపుత్రుడు సిద్ధార్థను డైరెక్టర్ గానూ కొనసాగించేందుకు కూడా డియాజియో ఒప్పుకుంది.

  • Loading...

More Telugu News