: ‘మంచు’ వారి భారీ అవార్డు!... ‘డాక్టర్ మోహన్ బాబు టీచర్ అవార్డు’ పేరిట రూ.1 లక్ష రివార్డు!
టాలీవుడ్ లో విలక్షణ నటుడిగా పేరుగాంచిన మంచు మోహన్ బాబు పూర్వాశ్రమంలో ఉపాధ్యాయుడిగా పనిచేశారు. తన తండ్రి నారాయణస్వామి నాయుడు బాటలోనే నడిచిన మోహన్ బాబు... తండ్రిలాగే ఉత్తమ ఉపాధ్యాయుడిగా పేరు తెచ్చుకున్నారు. ఆ తర్వాత సినీరంగ ప్రవేశం చేసినా, విద్య పట్ల తనకున్న మమకారాన్ని చంపుకోలేని మోహన్ బాబు... ‘విద్యానికేతన్’ పేరిట 1992లో ఓ విద్యాలయాన్ని ఏర్పాటు చేశారు. తిరుపతి కేంద్రంగా విద్యాబోధన చేస్తున్న ఈ విద్యాలయం తెలుగు రాష్ట్రాల్లోనే పేరొందిన విద్యా సంస్ధగా పేరు తెచ్చుకుంది. తాజాగా విద్యపై, విద్యాబోధన చేస్తున్న ఉపాధ్యాయ వృత్తిపై తనకున్న అపార గౌరవాన్ని చాటుకుంటూ మోహన్ బాబు ఓ భారీ అవార్డును ప్రకటించారు. ‘విద్యానికేతన్’ నుంచి ఈ ఏడాది నుంచే ఇవ్వనున్న ఈ అవార్డుకు ‘డాక్టర్ మోహన్ బాబు టీచర్ అవార్డు’ అని పేరు పెట్టారు. తెలుగు రాష్ట్రాల్లో పదేళ్ల పాటు ఉపాధ్యాయ వృత్తిలో ఉండి, విద్యాబోధనలో తమదైన శైలిలో సత్తా చాటుతున్న ఉపాధ్యాయుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తూ నేడు ‘విద్యానికేతన్’ ఓ భారీ పత్రికా ప్రకటనను జారీ చేసింది. ఈ అవార్డుకు ఎంపికైన ఉపాధ్యాయుడిని రూ.1 లక్షతో సత్కరించనున్నట్లు ‘విద్యానికేతన్’ ప్రకటించింది. అవార్డు గ్రహీత ఎంపిక కోసం పలు రంగాలకు చెందిన ప్రముఖులతో ఆ విద్యా సంస్థ జ్యూరీ కమిటీని కూడా ప్రకటించింది. దరఖాస్తు ఫారాన్ని ‘విద్యానికేతన్.ఈడీయూ’ వెబ్ సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకుని, వచ్చే నెల (మార్చి) 10 లోగా ఈ-మెయిల్ ద్వారానే పూర్తి చేసిన దరఖాస్తును అందజేయాలని ‘విద్యానికేతన్’ ఆ ప్రకటనలో పేర్కొంది.