: మధ్యాహ్న భోజనంతో 247 మంది విద్యార్థులకు అస్వస్థత
మధ్యాహ్న భోజనం తిన్న 247 మంది పాఠశాల విద్యార్థులు అస్వస్థతకు లోనయ్యారు. మహారాష్ట్రలోని పాల్గాడ్ జిల్లా కాసా బద్రుక్ గ్రామంలో జిల్లా పరిషత్ పాఠశాలలో గురువారం మధ్యాహ్నం విద్యార్థులకు కిచిడీని ఆహారంగా ఇస్కాన్ సంస్థ అందించింది. ఒకటి నుంచి ఏడో తరగతి విద్యార్థులు కిచిడీ తిని తరగతి గదులకు వెళ్లిపోయారు. అరగంట తర్వాత విద్యార్థులకు వాంతులు, కడుపులో నొప్పి, తల తిరగడం మొదలైంది. సుమారు 50 మంది విద్యార్థులు ఇవే లక్షణాలతో బాధపడుతుంటే టీచర్లు వారిని తాల్వాడ్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. సాయంత్రానికి మధ్యాహ్న భోజనం తిన్న మిగిలిన విద్యార్థులు కూడా (మొత్తం 247 మంది) కడుపులో నొప్పి వస్తుందనడంతో అందరినీ విక్రంగడ్ ఆస్పత్రిలో చేర్పించారు. ఈ ఘటనపై కాసా పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. జిల్లా వైద్య శాఖ అధికారులు స్కూల్ ను సందర్శించి మిగిలి ఉన్న కిచిడీని స్వాధీనం చేసుకుని పరీక్షల కోసం పంపారు.