: ఈ రోజు కోసం 23 ఏళ్లు ఎదురుచూశా: సంజయ్ దత్
ఎరవాడ జైలు నుంచి విడుదలైన అనంతరం ముంబయి వెళ్లిన బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ముందుగా సిద్ధి వినాయకుడిని దర్శించుకున్నాడు. తరువాత తన నివాసానికి చేరుకున్నాడు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సంజూ ఉద్వేగంగా మాట్లాడాడు. తాను జైలులో ఉన్న సమయంలో తన కంటే తన భార్య మాన్యతే ఎక్కువగా బాధపడిందని చెప్పాడు. ఆమే తనకు మంచి భాగస్వామి అని, బలమని తెలిపాడు. అందుకే జైలులో తాను సంపాదించిన రూ.440 భార్యకు ఇచ్చానన్నాడు. జైలు నుంచి విడుదలయ్యే ముందు నాలుగు రోజులు భోజనం చేయలేదని చెప్పాడు. ముఖ్యంగా ఈ కేసు నుంచి బయటపడే విషయంలో ఈ రోజు కోసం తాను 23 ఏళ్లుగా ఎదురు చూశానని తెలిపాడు. ఇకపై మూడు రంగుల జాతీయ జెండాయే తన జీవితమన్న సంజయ్, అందుకే జైలు నుంచి బయటకు రాగానే భరత భూమిని ముద్దాడానని, జాతీయ జెండాకు వందనం చేశానని పేర్కొన్నాడు. ఇక నుంచి తన కుటుంబానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తానని, తరువాతే పనిలోకి వెళతానని చెప్పుకొచ్చాడు.