: మొదట ఇద్దరం, ఆపై 18 నుంచి 67కు పెరిగాం, ఓ ఏడాది చూసి వాళ్లే వస్తారులే: జగన్
"వైకాపా పెట్టినప్పుడు నేను, మా అమ్మ మాత్రమే ఉన్నాం. ఆపై 18 మంది ఎమ్మెల్యేలు వస్తే, వాళ్లతో రాజీనామాలు చేయించి, ఎన్నికలకు వెళ్లి మరీ అందరినీ గెలిపించుకున్నాం. తరువాత మా బలం 67కు పెరిగింది. ప్రజల్లో వైకాపా పట్ల మక్కువ పెరుగుతోందనడానికి ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలి? కొంతమంది ఎమ్మెల్యేలు వెళ్లిపోయినా, ప్రజల్లో మా స్థానం మాకుంది. ఫిరాయింపులపై చంద్రబాబుకు సవాల్ విసురుతున్నా. సిగ్గుంటే ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికలకు పద. ప్రజలు ఎవరికి ఓటేస్తారో చూసుకుందాం" అని వైఎస్సార్ పార్టీ అధినేత జగన్ సవాల్ విసిరారు. ఒకవేళ రాజీనామాలు చేయించకపోతే, ఓ ఏడాది చూసి వాళ్లే వెనక్కు వస్తారని జగన్ అభిప్రాయపడ్డారు. అప్పుడు కూడా తాము నైతికత వెంటే నిలుస్తామని, వారితో రాజీనామాలు చేయించి, తిరిగి గెలిపించుకునే సత్తా తమకుందని అన్నారు.