: విశాఖ జోన్ లేదు, నడికుడి పేరూ లేదు... తెలుగు రాష్ట్రాలకు దక్కింది ఇదే!


రైల్వే బడ్జెట్ పై గంపెడాశతో ఎదురుచూసిన తెలుగు రాష్ట్రాల ప్రజలకు నిరాశే మిగిలింది. విశాఖకు ప్రత్యేక రైల్వే జోన్ ప్రకటిస్తారని వెయ్యి కళ్లతో ఎదురుచూసిన వారి ఆశ మరో ఏడాది వాయిదా పడింది. దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న ఏ ప్రాజెక్టుకూ నిధులు కేటాయించినట్టు సురేష్ ప్రభు ప్రకటించలేదు. ప్రధానమైన నడికుడి - శ్రీకాళహస్తి, మాచర్ల - మిర్యాలగూడ, గుంటూరు - గుంతకల్ విద్యుదీకరణ, భువనగిరి - నడికుడి విద్యుదీకరణ, యాదాద్రి వరకూ మెట్రో విస్తరణ, కడప - బెంగళూరు, కోటిపల్లి - నర్సాపూర్, కాకినాడ - పిఠాపురం, తుమ్కూరు - రాయదుర్గం, భీమవరం - నర్సాపురం - నిడదవోలు డబ్లింగ్, దేవరపల్లి - పెనుగొండ లైన్ వంటి అంశాల గురించిన ప్రస్తావనలు ఏమీ లేవు. ఇక తెలంగాణ సర్కారు భాగస్వామ్యంతో కొన్ని ప్రాజెక్టులు చేపడతామని, హైదరాబాద్ సబర్బన్ రైల్వే వ్యవస్థను విస్తరిస్తామన్న మాట తప్ప మరో ప్రస్తావన లేదు. ఏపీ విషయానికి వస్తే, ఆధ్యాత్మిక రైల్వే స్టేషన్ల అభివృద్ధిలో భాగంగా తిరుపతి స్టేషన్ పేరు ఓ మారు వినిపించింది. విజయవాడ - ఖరగ్ పూర్ మధ్య మూడవ లైన్ ను నిర్మిస్తామని చెప్పారే తప్ప, పనులు ఎప్పుడు మొదలవుతాయన్న విషయాన్ని, నిధుల కేటాయింపునూ వెల్లడించకుండానే సురేష్ ప్రభు తదుపరి అంశానికి వెళ్లిపోయారు. నాగపూర్ - విజయవాడ మధ్య వాణిజ్య రైల్వే లైన్ ను ప్రతిపాదించారు. ఈ అంశాలు మినహా తెలుగు రాష్ట్రాలకు దక్కిందేమీ లేదు.

  • Loading...

More Telugu News