: రైల్వేలో ప్రయాణికుల నుంచి సలహాల స్వీకరణకు ఐవీఆర్ఎస్ నెంబర్
రైల్వే ప్రయాణికుల నుంచి నేరుగా సలహాల స్వీకరణ కోసం ఐవీఆర్ఎస్ నెంబర్ ను ఏర్పాటు చేయబోతున్నట్టు రైల్వే మంత్రి సురేశ్ ప్రభు లోక్ సభలో వెల్లడించారు. రైల్వేలో రూపాయి ఖర్చు పెట్టి రూ.5 అభివృద్ధి సాధించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. రోజుకు 7 కిలోమీటర్ల మేర రైల్వే లైన్ల నిర్మాణం చేస్తున్నామని తెలిపారు. రైల్వే వ్యవస్థలో 2017-18లో 9వేల ఉద్యోగాల కల్పనకు చర్యలు తీసుకుంటున్నామని ప్రకటించారు. వచ్చే ఏడాది 2వేల కిలోమీటర్ల మేర రైల్వే మార్గాలకు విద్యుదీకరణ చేబడతామన్నారు. ఢిల్లీ- చెన్నై, ఖరగ్ పూర్ -ముంబై, ఖరగ్ పూర్-విజయవాడ మధ్య సరకు రవాణా మార్గాలు కల్పించనున్నట్టు తెలిపారు. ఇకపై ఎలక్ట్రానిక్ పద్ధతిలోనే రైల్వే టెండర్లు స్వీకరిస్తామని చెప్పారు. మిజోరం-మణిపూర్ రైల్వే లైన్ ను బ్రాడ్ గేజ్ గా మారుస్తామని, మేక్ ఇన్ ఇండియాలో భాగంగా రెండు కొత్త లోకో ఫ్యాక్టరీలు ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు. అన్ని విభాగాల్లో కాగిత రహిత ఎలక్ట్రానిక్ వ్యవస్థ దిశగా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.