: భద్రతా బలగాలు రక్షించిన వారిలో సయిద్ సలావుద్దీన్ కుమారుడు!
శ్రీనగర్ లోని పాంపోర్ లో జరిగిన ఎన్ కౌంటర్ లో ఓ తీవ్రవాది కుమారుడిని భారత భద్రతా బలగాలు రక్షించాయి. అతను హిజ్బుల్ ముజాహిద్దీన్ అగ్రనేత అయిన సయిద్ సలావుద్దీన్ కుమారుడు సయిద్ మొయిన్ అని పోలీసులు తెలిపారు. గతవారం ఉగ్రవాదులతో జరిగిన ఎదురుకాల్పుల్లో వందమందిని ఆర్మీ కాపాడింది. వారిలోనే అతను ఉన్నట్టు చెప్పారు. మొయిన్ ఎంటర్ ప్రెన్యూర్ షిప్ డెవలప్ మెంట్ ఇన్ స్టిట్యూట్ (ఈడీఐ)లో ఐటీ మేనేజర్ గా పని చేస్తున్నాడని, సలావుద్దీన్ ముగ్గురు కుమారుల్లో ఇతను ఒకడని పోలీసులు వెల్లడించారు. అయితే అతనికి తీవ్రవాద సంస్థలతో ఎలాంటి సంబంధాలు లేవని చెప్పారు. అయినప్పటికీ ఈడీఐపై ఉగ్రవాదుల దాడి తరువాత మొయిన్ ను పోలీసులు ప్రశ్నించినట్టు సమాచారం.