: అమరావతి సైడ్ రావద్దు బాబోయ్!
నవ్యాంధ్ర రాజధాని అమరావతి ప్రాంతాన్ని సందర్శించాలని, అక్కడ జరుగుతున్న పనులను చూడాలని ప్రజలు నిత్యమూ తండోపతండాలుగా వస్తున్న నేపథ్యంలో అధికారులు ఆందోళన చెందుతున్నారు. నాలుగు నెలల్లో తాత్కాలిక సచివాలయ భవనాలను నిర్మించాల్సి వుందని, పనులు వేగంగా సాగుతున్నందున ఇటువైపు రావద్దని హెచ్చరిస్తున్నారు. పునాదులు, లోయర్ ఫ్లోర్లలో భాగంగా దాదాపు 100 అడుగుల వరకూ లోతుండే ఎన్నో పెద్ద పెద్ద గుంతలను తవ్వాల్సి వుందని, దురదృష్టవశాత్తూ వాటిల్లో పడే ప్రమాదం ఉందని చెబుతున్నారు. ఇప్పటికే పెద్ద పెద్ద ప్రొక్లెయినర్లు, భారీ యంత్ర పరికరాలు ఇక్కడికి చేరాయని, వాటి వద్దకు వెళ్లవద్దని సలహాలు ఇస్తున్నారు. రైతులు కూడా వారి పశువులను మేత కోసం ఈ వైపు తోలవద్దని హెచ్చరికల బోర్డులు ఏర్పాటు చేశారు. ఇరుకుగా ఉన్న రహదారులపై ప్రయాణించే వారు సైతం జాగ్రత్తగా ఉండాలని కోరుతున్నారు.