: జేఎన్ యూ 'సెక్స్ హబ్' అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎమ్మెల్యేపై అధిష్ఠానం కన్నెర్ర!
ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం డ్రగ్స్, శృంగార కేంద్రంగా మారిందంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన రాజస్థాన్ రాష్ట్ర బీజేపీ ఎమ్మెల్యే జ్ఞాన్ దేవ్ అహుజాపై పార్టీ అధినాయకత్వం కన్నెర్ర జేసింది. 'జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ మత్తు పదార్థాలు, శృంగారానికి కేంద్రంగా కనిపిస్తోంది. అక్కడ 3000 వాడి పారేసిన కండోమ్ లు, 2000 మద్యం బాటిళ్లు రోజూ కనిపిస్తుంటాయి. 10 వేలకు పైగా సిగరెట్ ముక్కులు, నాలుగు వేలకు పైగా బీడీ ముక్కలు, 50 వేలకు పైగా జంతువుల బొక్కలు కూడా బయటపడుతుంటాయి. జాతి వ్యతిరేకులు మన సోదరీమణులు, బిడ్డలపై పాపపు పనులకు ఒడిగడుతున్నారు. గర్భనిరోధక ఇంజెక్షన్లు కూడా అక్కడ కనిపిస్తాయి' అంటూ అహుజా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. యూనివర్సిటీలో విద్యార్థులు రాత్రి 8 గంటల తర్వాతే డ్రగ్స్ తీసుకుంటారని చెప్పారు. అక్కడ చదువుతున్నది చిన్న పిల్లలేం కాదు, ఒక్కొక్కరు ఇద్దరు చిన్న పిల్లలకు తల్లిదండ్రులుగా ఉన్నారని ఆయన అన్నారు. దీంతో, అసలే జేఎన్ యూ వ్యవహారంలో ప్రతిపక్షాలన్నీ ఏకమై కేంద్ర ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్న తరుణంలో ఎమ్మెల్యే వ్యాఖ్యలు పార్టీని ఇరుకున పడేసేలా ఉండడంతో ఢిల్లీకి వచ్చి వివరణ ఇవ్వాలని ఎమ్మెల్యే అహుజాను పార్టీ అధినాయకత్వం ఆదేశించింది.