: మాజీ సీఎం సన్నిహితుడిపై దేశ ద్రోహం కేసు
హర్యానాలో జాట్ల రిజర్వేషన్ల ఉద్యమం అదుపుతప్పి అల్లర్లకు దారితీసిన ఘటనలో పోలీసులు తమ చర్యలకు పదునుపెట్టారు. మాజీ ముఖ్యమంత్రి భూపిందర్ సింగ్ హుడా సన్నిహితుడు అయిన వీరేందర్ పై బుధవారం దేశద్రోహం కేసు మోపారు. వీరేందర్ తోపాటు మన్ సింగ్ దలాల్ అనే వ్యక్తిపై కూడా ఇవే ఆరోపణలతో పలు సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు రాష్ట్ర డీజీపీ యష్ పాల్ మాలిక్ చండీగఢ్ లో విలేకరులకు తెలిపారు. భివానీ ప్రాంతానికి చెందిన పంకజ్ కుమార్ అనే వ్యక్తి చేసిన ఫిర్యాదు మేరకు చర్యలు చేపట్టినట్టు వెల్లడించారు. జాట్ రిజర్వేషన్ల ఉద్యమం ఆందోళనల సందర్భంగా ఉద్దేశపూర్వకంగా వీరేందర్ తన ప్రసంగంతో హింసను ప్రేరేపించారని పేర్కొంటూ అందుకు సంబంధించిన ఓ ఆడియో క్లిప్ ఆధారంగా పోలీసులు కేసులు నమోదు చేశారు. కాగా, ఆడియో టేప్ లో ఉన్నది తన స్వరమేనని వీరేందర్ కూడా ధ్రువీకరించారు. అయితే, తనతోపాటు కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ఠ దెబ్బతీసే కుట్రలో భాగంగా దీన్ని తీర్చిదిద్దారని ఆరోపించారు. జాట్లను రెచ్చగొట్టేలా తాను ఎక్కడా మాట్లాడలేదని స్పష్టం చేశారు. మరోవైపు ఆడియో టేపు తెరపైకి రావడంతో కాంగ్రెస్ పార్టీ దిద్దుబాటు చర్యలకు దిగింది. పీసీసీ ప్రతినిధిగా ఉన్న వీరేందర్ కు షోకాజ్ నోటీసు జారీ చేసింది.