: గ్రామీణ ప్రాంతాల్లో వైద్యులు 24 గంటలూ పనిచేయాలి: సీఎం కేసీఆర్
రాష్ట్రంలో 104, 108 వైద్య విభాగాల సేవలను పటిష్ఠం చేస్తామని సీఎం కేసీఆర్ అన్నారు. వైద్య ఆరోగ్య శాఖ బడ్జెట్ ప్రతిపాదనలపై ముఖ్యమంత్రి ఆ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా జనరిక్ మందుల దుకాణాలు ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లో వైద్యులు 24 గంటలూ అందుబాటులో ఉండాలని, అందుకు షిఫ్ట్ ల విధానాన్ని ఆచరణలోకి తేవాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసేవారికి అదనపు ప్రోత్సాహకాలు అందిస్తామని తెలిపారు. ఖాళీగా ఉన్న వైద్యులు, ఇతర పోస్టులను భర్తీ చేస్తామని పేర్కొన్నారు. వైద్య ఆరోగ్య శాఖలో సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరాన్ని కూడా సీఎం ప్రస్తావించారు. ఈ శాఖకు కోరినన్ని నిధులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి బోధనాస్పత్రుల వరకూ పరిస్థితులు మెరుగు పడాలన్నారు. ఇకపై ఆస్పత్రుల వారీగా బడ్జెట్ కేటాయిస్తామని, నిర్వహణ వ్యయంపై అధికారులు ఈ నెల 28లోగా వివరాలు అందించాలని ఆదేశించారు. అన్ని ప్రభుత్వ ఆస్పత్రులకు రోగ నిర్ధారణ పరికరాలు అందిస్తామని, కొనుగోలుకు రాష్ట్ర స్థాయిలో కమిటీని ఏర్పాటు చేస్తామని అన్నారు. నిధుల విషయంలో అధికారాలను అధికారులకు బదలాయిస్తామని చెప్పారు.