: కేసీఆర్ ఇప్పటి వరకూ అందుబాటులోకి రాలేదు: స్మృతి ఇరానీ
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పరిశోధక విద్యార్థి రోహిత్ ఆత్మహత్య తనను కలచివేసిందని కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీ అన్నారు. లోక్ సభలో ఈ అంశంపై ప్రతిపక్షాల ఆరోపణలకు మంత్రి ఘాటుగా స్పందించారు. రోహిత్ ఆత్మహత్యపై ప్రతిపక్షాలు శవరాజకీయాలు చేస్తున్నాయని మండిపడ్డారు. రోహిత్ మృత దేహాన్ని ఆస్పత్రికి తీసుకెళ్లకుండా యూనివర్సిటీలోనే ఉంచి రాజకీయాలకు వాడుకున్నారని ప్రతిపక్షాల తీరును దుయ్యబట్టారు. హెచ్ సీయాలో విద్యార్థుల ఆత్మహత్యలపై కాంగ్రెస్ నేత వీహెచ్ కూడా తనకు లేఖ రాశారని, అలాగే ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ కూడా లేఖ రాశారని ఆమె వెల్లడించారు. తాను కూడా విధి నిర్వహణలో భాగంగానే లేఖ రాసినట్టు స్పష్టం చేశారు. ఈ విషయంలో తాను ఎవరికీ క్షమాపణలు చెప్పనన్నారు. రోహిత్ ఆత్మహత్య చేసుకున్న రోజు ఆ విషయమై మాట్లాడదామని సీఎం కేసీఆర్ కు కాల్ చేస్తే బిజీగా ఉన్నారని సిబ్బంది చెప్పారని... అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన అందుబాటులోకి రాలేదన్నారు. కేసీఆర్ కుమార్తె, ఎంపీ కవితకు కాల్ చేసి మాట్లాడానన్నారు.