: మా అబ్బాయి శ్రీనివాస్ పై కేసు వాస్తవమే... కానీ నిర్దోషి: విజయరామారావు
నకిలీ డాక్యుమెంట్లతో తన కుమారుడు శ్రీనివాస్ కల్యాణరావు పలు బ్యాంకుల నుంచి రూ.304 కోట్ల మేరకు రుణాలు తీసుకుని ఎగ్గొట్టిన కేసుపై టీఆర్ఎస్ నేత, సీబీఐ మాజీ చీఫ్ విజయరామారావు తొలిసారి స్పందించారు. హైదరాబాదులోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తన కుమారుడు శ్రీనివాస్ పై కేసు పెట్టిన మాట వాస్తవమేనన్నారు. అయితే అతను అమాయకుడని, నిర్దోషని, ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. ఈ కేసుకు సంబంధించి త్వరలోనే నిజాలు బయటికొస్తాయని, ఆధారాలతో నిరూపిస్తామని తెలిపారు. కోర్టుకు, మీకు (మీడియా) త్వరలోనే అన్ని విషయాలు వెల్లడిస్తానని తెలిపారు. 'ముందు ముందు అన్నీ మీరే చూస్తారు కదా' అన్నారు. కాకుంటే నిజాలు బయటికి రావడానికి కాస్త సమయం పడుతుందన్నారు. తన కొడుకు దోషి అనడం సరికాదని, చట్టపరమైన రుజువులు చేస్తేనే దోషిగా నిరూపణ అవుతుందని పేర్కొన్నారు. ఈ కేసుకు సంబంధించి ప్రొసీడింగ్స్ చూశాను తప్ప, సీబీఐను సంప్రదించలేదని వివరించారు. తాను 20 ఏళ్ల కిందటే సీబీఐ నుంచి రిటైర్ అయ్యానని చెప్పారు.