: 'బేర్'మన్న సెన్సెక్స్, నిఫ్టీ... మరో రూ. 1.22 లక్షల కోట్లు హాంఫట్!
మరింతగా పతనమైన క్రూడాయిల్, చైనా మార్కెట్ నష్టాల ప్రభావంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ నశించగా, బారత స్టాక్ మార్కెట్ వరుసగా రెండో రోజూ నష్టపోయింది. సెషన్ ఆరంభంలోనే క్రితం ముగింపుతో పోలిస్తే 100 పాయింట్లకు పైగా నష్టపోయిన సెన్సెక్స్, ఆపై మరింతగా దిగజారింది. దీంతో దాదాపు రూ. 1.22 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద హారతి కర్పూరమైంది. బుధవారం నాటి సెషన్ ముగిసేసరికి బీఎస్ఈ సెన్సెక్స్ సూచిక 321.25 పాయింట్లు పడిపోయి 1.37 శాతం నష్టంతో 23,088.93 పాయింట్ల వద్దకు, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచిక నిఫ్టీ 90.85 పాయింట్లు పడిపోయి 1.28 శాతం నష్టంతో 7,018.70 పాయింట్ల వద్దకు చేరాయి. బీఎస్ఈలో మిడ్ క్యాప్ 0.79 శాతం, స్మాల్ క్యాప్ 1.15 శాతం నష్టపోయాయి. ఎన్ఎస్ఈ-50లో 13 కంపెనీలు మాత్రమే లాభాలను నమోదు చేశాయి. బీపీసీఎల్, పవర్ గ్రిడ్, బ్యాంక్ ఆఫ్ బరోడా, యస్ బ్యాంక్, మహీంద్రా అండ్ మహీంద్రా తదితర కంపెనీలు లాభపడగా, బీహెచ్ఈఎల్, ఎన్టీపీసీ, టాటా మోటార్స్, హిందాల్కో, కెయిర్న్ ఇండియా తదితర కంపెనీల ఈక్విటీలు నష్టపోయాయి. బీఎస్ఈలో మొత్తం 2,705 కంపెనీల ఈక్విటీలు ట్రేడ్ కాగా, 810 కంపెనీలు లాభాల్లోను, 1742 కంపెనీల ఈక్విటీలు నష్టాల్లోనూ నడిచాయి. మంగళవారం నాటి సెషన్ ముగింపు సమయంలో రూ. 87,80,501 కోట్లుగా ఉన్న బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ కాప్ మంగళవారం నాడు రూ. 86,58,842 కోట్లకు తగ్గింది.