: తాగిన కొడుకును ఆపాడని... పోలీస్ స్టేషన్ లో ఎస్సైని చితగ్గొట్టిన ఎస్పీ మహిళా నేత!


ఉత్తరప్రదేశ్ లో అధికార సమాజ్ వాదీ పార్టీ నేతలు బరి తెగిస్తున్నారు. నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలతో ఆ పార్టీ సీనియర్ నేత, యూపీ మంత్రి ఆజం ఖాన్ హల్ చల్ చేస్తోంటే, ఆ పార్టీ నేతలు మరింతగా బరి తెగిస్తున్నారు. ప్రత్యర్థి పార్టీల నేతలపై విరుచుకుపడుతున్న ఎస్పీ నేతలు తాజాగా పోలీసులపైనా తిరగబడుతున్నారు. ఇలాంటి ఘటనే తాజాగా ఆ రాష్ట్రంలో చోటుచేసుకుంది. సమాజ్ వాదీ పార్టీకి చెందిన మహిళా నేత సంగీతా రౌల్... ఓ ఎస్సైనే చితకబాదింది. మహిళా నేత దాడిలో మీరట్ లో విధులు నిర్వర్తిస్తున్న సర్వేశ్ కుమార్ కాలు విరిగింది. వివరాల్లోకెళితే... సంగీతా రౌల్ కుమారుడు తన మిత్రులతో కలిసి ఫుల్లుగా మద్యం సేవించి కారెక్కారట. నగరంలోని ఓ చెక్ పోస్టు వద్ద తనిఖీలు నిర్వహిస్తున్న సర్వేశ్ కుమార్ సదరు కారును ఆపారు. ఈ విషయం తెలుసుకున్న రౌల్ ఆగ్రహావేశాలతో ఊగిపోయారు. నేరుగా పోలీస్ స్టేషన్ కు వచ్చిన ఆమె.. వారిస్తున్నా వినకుండా స్టేషన్ లోకి చొచ్చుకెళ్లారు. ముందూ వెనుకా చూసుకోకుండా, సర్వేశ్ కుమార్ పై దాడికి దిగారు. ఆ తర్వాత మరోమారు తన కుమారుడిని ఆపితే సహించేది లేదని హెచ్చరికలు జారీ చేసి వెళ్లిపోయారు. రౌల్ దాడిలో కాలు విరిగిన సర్వేశ్ కుమార్ ను స్టేషన్ సిబ్బంది ఆసుపత్రికి తీసుకెళ్లి కట్టు కట్టించారు. దీనిపై సర్వేశ్ కుమార్ నుంచి ఫిర్యాదు అందుకున్న పోలీసు ఉన్నతాధికారులు రౌల్ ను అదుపులోకి తీసుకున్నారు.

  • Loading...

More Telugu News