: నెవడాలో ట్రంప్ కు భారీ మెజారిటీ... సుదూరంగా ట్రెడ్ క్రూజ్, మార్కో రుబియో!
అమెరికాలో రిపబ్లికన్ల తరఫున అధ్యక్ష బరిలో దిగాలని భావిస్తున్న డొనాల్డ్ ట్రంప్, తన లక్ష్యానికి మరింత దగ్గరయ్యారు. మంగళవారం నెవడాలో జరిగిన ఓటింగ్ లో ప్రత్యర్థుల కన్నా ఆయన భారీ మెజారిటీని సాధించారు. ట్రంప్ కు 42 శాతం మంది రిపబ్లికన్లు మద్దతు పలకగా, ఫ్లోరిడాకు చెందిన మార్కో రుబియోకు 25 శాతం, టెక్సాస్ కు చెందిన టెడ్ క్రూజ్ కు 22 శాతం ఓట్లు లభించినట్టు తెలుస్తోంది. ట్రంప్ కు ఇది వరుసగా మూడవ విజయం. ఈ సందర్భంగా ట్రంప్ "నెవడాకు కృతజ్ఞతలు. మనం అమెరికాను సురక్షితంగా గొప్ప దేశంగా తయారుచేద్దాం" అని ట్వీట్ చేశారు. పోటీలో నిలిచిన మరో ఇద్దరు రిపబ్లికన్ అభ్యర్థులు బెన్ కార్సన్, జాన్ కాసిచ్ లకు వరుసగా 7, 4 శాతం ఓట్లు లభించాయని సీఎన్ఎన్, ఫాక్స్ న్యూస్ వార్తా సంస్థలు వెల్లడించాయి. వచ్చే మంగళవారం 11 రాష్ట్రాల్లో జరగనున్న ఓటింగ్ వీరందరికీ కీలకం కానుంది.