: క్యాంపు రాజకీయాలు చేయడం చంద్రబాబుకు అలవాటే: కొడాలి నాని, పెద్దిరెడ్డి
టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు ప్రోత్సహిస్తున్న పార్టీ పిరాయింపులపై వైసీపీ ఎమ్మెల్యేలు తీవ్ర విమర్శలు చేశారు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం, క్యాంపు రాజకీయాలు చేయడం ఆయనకు అలవాటేనని ఎమ్మెల్యేలు కొడాలి నాని, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యాఖ్యానించారు. ఈ మేరకు విజయవాడలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారిద్దరు మాట్లాడుతూ, చంద్రబాబుకు నైతిక విలువలు లేవన్నారు. దమ్ముంటే పార్టీలో చేర్చుకున్న నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికలకు వెళ్లాలని డిమాండ్ చేశారు. పార్టీ పిరాయింపులపై తాము గవర్నర్, స్పీకర్ కు ఫిర్యాదు చేయాలనుకోవడంలేదని, ఒకవేళ ఫిర్యాదు చేసినా ఉపయోగం ఉండదని అన్నారు. ఒకరిద్దరు పార్టీ నుంచి వెళ్లినా తమకు వచ్చిన నష్టమేం లేదన్నారు. మార్చి 6న వైసీపీ కార్యాలయాన్ని విజయవాడలో ప్రారంభించనున్నట్టు నాని, పెద్దిరెడ్డి తెలిపారు.