: రాజకీయ పార్టీల తీరు మారలేదు!... జేఎన్ యూ ఘటనకు నిరసనగా జేడీయూ, లెఫ్ట్ ఎంపీల ధర్నా


గడచిన పార్లమెంటు సమావేశాల్లో ‘అసహనం’పై గొంతెత్తిన కాంగ్రెస్ పార్టీ... ఆ సమావేశాల్లో మెజారిటీ సమయాన్ని వృథా చేసేసింది. మిగిలిన విపక్షాలు కూడా అసహనంపై చర్చకు పట్టుబట్టడంతో నాటి సమావేశాలు దాదాపుగా స్తంభించాయి. వెరసి నాటి పార్లమెంటు సమావేశాలు ఎలాంటి కీలక చర్చ లేకుండానే ముగిశాయి. తాజాగా నిన్న బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. తొలి రోజు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగం నేపథ్యంలో నిన్న ఎలాంటి గొడవ జరగలేదు. తాజాగా నేటి సమావేశాలు ప్రారంభం కాకముందే మళ్లీ విపక్షాలు రంగంలోకి దిగాయి. ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ వర్సిటీలో చోటుచేసుకున్న వివాదానికి నిరసనగా ఆందోళనలకు శ్రీకారం చుట్టాయి. ఇందులో భాగంగా జేడీయూ, వామపక్ష పార్టీలకు చెందిన ఎంపీలు పార్లమెంటు ప్రాంగణంలోని గాంధీ విగ్రహం ముందు ధర్నాకు దిగాయి. సమావేశాలు ప్రారంభం కాకముందే నిరసన గళం వినిపించిన విపక్షాలు... ఈ సమావేశాల్లోనూ ప్రభుత్వంపై విరుచుకుపడటం తప్పదని తేల్చిచెప్పాయి. వెరసి ఈ సమావేశాల్లోనూ అర్థవంతమైన చర్చ జరుగుతుందా? అన్న అనుమానాలు నెలకొన్నాయి.

  • Loading...

More Telugu News