: తిరుమల వెంకన్న ప్రసాదంలో పిన్నీసు!
తిరుమల కొండపై వెలసిన శ్రీవేంకటేశ్వర స్వామివారి మహా ప్రసాదం ‘తిరుమల లడ్డూ’ నాణ్యత, రుచి విశ్యవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి. వెంకన్న ప్రసాదంలో ఉన్నంత నాణ్యత మరే ఆలయ ప్రసాదంలోనూ కనిపించదు. అదే తిరుమల ఆలయ ప్రత్యేకత. నిత్యం లక్షల సంఖ్యలో లడ్డూలు తయారవుతున్నా, ఎప్పుడూ ప్రసాదానికి కొరతే. అదే వెంకటేశుడి ప్రసాదానికి ఉన్న ప్రత్యేకత. తిరుమల ఆలయ పరిసరాల్లో ‘పోటు’ పేరిట ప్రత్యేకంగా ఏర్పాటైన వంటశాలలో వెంకన్న ప్రసాదం తయారవుతోంది. ఏమాత్రం విరామం లేకుండా సాగుతున్న లడ్డూల తయారీలో తిరుమల తిరుపతి దేవస్థానం నిత్యం అప్రమత్తంగానే ఉంటోంది. ఈ క్రమంలో తిరుమల ప్రసాదం నాణ్యతలో దానికదే సాటి. అలాంటి తిరుమల లడ్డూలో నిన్న ఓ పిన్నీసు కనబడి కలకలం రేపింది. ప్రసాదం పంపిణీ కేంద్రాల్లోని 13 వ కౌంటర్ నుంచి ప్రసాదం స్వీకరించిన ఓ భక్తుడు అందులో పిన్నీసును చూసి షాకయ్యాడు. వెంటనే తేరుకున్న అతడు... పిన్నీసు ఉన్న సదరు లడ్డూను తిరిగి ఆ కౌంటర్ లోని సిబ్బందికి స్వాధీనం చేశాడు. దీనిపై స్పందించిన టీటీడీ... రోజూ 3.5 లక్షల లడ్డూలు తయారవుతున్నాయని, ఈ క్రమంలో ఇలాంటి చిన్న చిన్న పొరపాట్లు సహజమేనని ప్రకటించింది. ఘటనపై విచారం వ్యక్తం చేసింది.