: రాజీవ్ హంతకురాలికి పెరోల్... వేలూరు నుంచి చెన్నై బయల్దేరిన నళిని
మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ హత్యకేసులో దోషిగా తేలి యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్న నళినికి పెరోల్ మంజూరైంది. 12 గంటల పాటు పెరోల్ లభించిన నళిని కొద్దిసేపటి క్రితం వేలూరు సెంట్రల్ జైలు నుంచి చెన్నై బయలుదేరింది. శ్రీపెరుంబుదూరులో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న రాజీవ్ గాంధీని మానవ బాంబుతో ఎల్టీటీఈ హత్య చేసింది. ఈ కేసులో జీవిత ఖైదు పడిన నళిని వేలూరులోని సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తోంది. ఈ క్రమంలో నిన్న చెన్నైలో ఉంటున్న నళిని తండ్రి చనిపోయాడు. తండ్రి అంత్యక్రియలకు హాజరయ్యేందుకు అనుమతించాలన్న నళిని పిటిషన్ పై సానుకూలంగా స్పందించిన అధికారులు ఆమెకు 12 గంటల పెరోల్ ను మంజూరు చేశారు. నళినికి పది మంది పోలీసులు ఎస్కార్టుగా చెన్నై వెళుతున్నారు.