: కేసీఆర్ ను చంపేస్తాం!... కోరుట్ల ఎమ్మెల్యేకు ఫోన్ చేసి చెప్పిన అపరిచితుడు
టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావును చంపేస్తామంటూ ఓ గుర్తు తెలియని వ్యక్తి నుంచి వచ్చిన ఫోన్ కాల్ కలకలం రేపుతోంది. నిన్న మధ్యాహ్నం టీఆర్ఎస్ నేత, కరీంనగర్ జిల్లా కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు మొబైల్ కు వచ్చిన ఈ బెదిరింపు కాల్ పై ప్రస్తుతం పోలీసులు ఆరా తీస్తున్నారు. ఓ నెట్ ఫోన్ నెంబరు నుంచి విద్యాసాగర్ రావు మొబైల్ కు ఫోన్ చేసిన సదరు వ్యక్తి... కరీంనగర్ జిల్లా మెట్ పల్లిలో బుధవారం జరగనున్న పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్ చెల్లి పెళ్లికి కేసీఆర్ హాజరవుతున్నారని చెప్పాడు. అంతేకాక అక్కడే కేసీఆర్ ను చంపేస్తామంటూ కూడా అతడు ఎమ్మెల్యేకు చెప్పాడు. సాక్షాత్తు సీఎం కేసీఆర్ నే చంపేస్తామంటూ తనకు ఫోన్ చేసి చెప్పిన అపరిచితుడి వ్యాఖ్యలతో తొలుత షాక్ కు గురైన విద్యాసాగర్ రావు... ఆ తర్వాత వెనువెంటనే తేరుకుని సదరు వ్యక్తిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తర్వాత తన పక్కనే ఉన్న ఎస్సైకి ఫోన్ ఇచ్చిన విద్యాసాగర్ రావు ఆ వ్యక్తితో మాట్లాడించారు. ఎస్సైతోనూ సదరు వ్యక్తి అలాగే మాట్లాడాడట. కేసీఆర్ ను చంపేస్తామని అతడు పదే పదే చెప్పడంతో ఎస్సై, ఆ విషయాన్ని జగిత్యాల డీఎస్పీ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై పోలీసులు విచారణ చేస్తున్నారు.