: ఇలాగైతే కుదరదు!... అగ్రిగోల్డ్ దర్యాప్తుపై చంద్రబాబు అసహనం


లక్షలాది మంది మధ్యతరగతి ప్రజలను నట్టేట ముంచి వేలాది కోట్ల రూపాయలు వెనకేసుకున్న అగ్రిగోల్డ్ యాజమాన్యంలోని కీలక వ్యక్తులు కటకటాల వెనక్కెళ్లారు. పేదల డబ్బుతో ఆ వ్యక్తులు కొన్న ఆస్తులను గుర్తించి వాటిని విక్రయించి బాధితులకు న్యాయం చేయాల్సిన గురుతర బాధ్యతను ఏపీ ప్రభుత్వం సీఐడీ అధికారులకు అప్పజెప్పింది. అయితే దర్యాప్తులో సీఐడీ ఆశించినంత వేగంగా ముందుకు సాగడం లేదని సాక్షాత్తు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇదే పంథా కొనసాగితే కేసును సీబీఐకి అప్పగించాల్సి వస్తుందని హెచ్చరికలు జారీ చేసింది. తాజాగా నిన్న శాంతిభద్రతల సమీక్షలో భాగంగా ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు కూడా హైకోర్టు తరహాలోనే స్పందించారు. కేసు దర్యాప్తు జరుగుతున్న తీరుపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. లక్షలాది కుటుంబాల ప్రయోజనాలతో ముడివడి ఉన్న ఈ కేసులో సీఐడీ ఆశించినంత వేగంగా ముందుకు సాగడం లేదని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. కనీసం ఇప్పటినుంచైనా కేసు దర్యాప్తులో వేగం పెంచాల్సి ఉందని ఆయన పోలీసు బాసులకు ఆదేశాలు జారీ చేశారు. లేని పక్షంలో కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించే విషయాన్నైనా పరిశీలించాలని ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. సాక్షాత్తు సీఎం చంద్రబాబే కేసు దర్యాప్తుపై అసహనం వ్యక్తం చేసిన నేపథ్యంలో పోలీసు బాసులు ఈ కేసు దర్యాప్తును ఇకపై ప్రత్యేకంగా పరిగణించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

  • Loading...

More Telugu News