: నాలుగు రోజుల లాభాలకు మంగళం!
భారత స్టాక్ మార్కెట్ లాభాలు నాలుగు రోజులకే పరిమితమయ్యాయి. గత వారాంతం నుంచి నిలదొక్కుకొని పైకి లేస్తూ వచ్చిన బెంచ్ మార్క్ సూచికలు ఒత్తిడిలో పడ్డాయి. బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన వేళ, సభా కార్యకలాపాలు సజావుగా సాగవన్న అనుమానాలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ను హరించాయి. దీనికితోడు ఆసియా, యూరప్ మార్కెట్ల నష్టాలు కూడా కొత్త కొనుగోళ్లను అడ్డుకున్నాయని నిపుణులు వ్యాఖ్యానించారు. మంగళవారం నాటి సెషన్ ముగిసేసరికి బీఎస్ఈ సెన్సెక్స్ సూచిక 378.61 పాయింట్లు పడిపోయి 1.59 శాతం నష్టంతో 23,410.18 పాయింట్ల వద్దకు, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచిక నిఫ్టీ 125 పాయింట్లు పడిపోయి 1.73 శాతం నష్టంతో 7,109.55 పాయింట్ల వద్దకు చేరాయి. బీఎస్ఈలో మిడ్ క్యాప్ 1.47 శాతం, స్మాల్ క్యాప్ 1.25 శాతం నష్టపోయాయి. ఎన్ఎస్ఈ-50లో ఒక కంపెనీ మాత్రమే లాభాలను నమోదు చేయడం గమనార్హం. ఆసియన్ పెయింట్స్, సుందరం ఫైనాన్స్, ఆర్ కాం, జేఎస్ డబ్ల్యూ స్టీల్, బజాజ్ ఫిన్ సర్వ్, అపోలో హాస్పిటల్స్, ఎన్ఎండీసీ తదితర కంపెనీలు లాభపడగా, బ్యాంక్ ఆఫ్ బరోడా, కెయిర్న్ ఇండియా, పీఎన్బీ, కోల్ ఇండియా, ఎస్బీఐ, అల్ట్రా సిమెంట్స్, బజాజ్ ఆటో, ఎన్టీపీసీ, ఐసీఐసీఐ తదితర కంపెనీల ఈక్విటీలు నష్టపోయాయి. బీఎస్ఈలో మొత్తం 2,646 కంపెనీల ఈక్విటీలు ట్రేడ్ కాగా, 604 కంపెనీలు లాభాల్లోను, 1,893 కంపెనీల ఈక్విటీలు నష్టాల్లోనూ నడిచాయి. సోమవారం నాటి సెషన్ ముగింపు సమయంలో రూ. 89,03,618 కోట్లుగా ఉన్న బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ కాప్ మంగళవారం నాడు రూ. 87,80,501 కోట్లకు తగ్గింది.