: తమిళనాట వేడెక్కుతున్న రాజకీయం... జయలలితకి శరత్ కుమార్ కటీఫ్!
తమిళనాడులో ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ రాజకీయాలు రసకందాయంలో పడుతున్నాయి. గత ఎన్నికల్లో సొంత పార్టీ ప్రకటించి పోటీకి దిగిన శరత్ కుమార్ పార్టీ సమథువా మక్కల్ కట్చి, అన్నా డీఎంకేతో పొత్తు పెట్టుకుని రెండు శాసనసభ స్థానాలను కైవసం చేసుకుంది. దక్షిణ తమిళనాడులో బలమైన సామాజిక వర్గం నాడర్ లో బలమైన ఓటు బ్యాంకు కలిగిన శరత్ కుమార్ ఇప్పుడు జయలలితకు దూరం జరిగారు. దీంతో ఆ పార్టీనుంచి విజయం సాధించిన ఎమ్మెల్యే నారాయణరావు శరత్ కుమార్ తో బంధాన్ని తెంచుకుని, జయలలిత పార్టీకి చేరువయ్యారు. దీంతో అతనిని శరత్ కుమార్ సస్పెండ్ చేశారు. ఈ సారి మరింత పటిష్ఠమైన ప్రణాళికతో ఎక్కువ స్థానాల్లో విజయం సాధించాలని శరత్ కుమార్ భావిస్తున్నారు. అందులో భాగంగా ఆయన అన్నాడీఏంకేతో తెగదెంపులు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గతంలో అన్నాడీఎంకేతో కొనసాగుతానని మాటఇచ్చానని, ఆ మాటకు కట్టుబడి ఇంత కాలం కూటమిలో కొనసాగానని అన్నారు. ఈ తెగదెంపులకి ఆ పార్టీని నిందించేందుకు ఏమీ లేదని చెప్పిన ఆయన, వెనక్కి తిరిగి చూసుకుంటే చేసిన దానికంటే చేయాల్సిందే ఎక్కువ ఉందని, లక్ష్యం సాధించేందుకే కూటమి నుంచి వైదొలిగానని ఆయన పేర్కొన్నారు. అయితే నడిగర్ సంఘం ఎన్నికల్లో శరత్ కుమార్ ను అన్నాడీఎంకే బలపరచలేదని, అందుకే ఆయన ఆ పార్టీతో తెగదెంపులు చేసుకున్నారని గుసగుసలు వినబడుతున్నాయి.