: చైనాను చిత్తు చేసిన భారత్!... బంగ్లా భారీ విద్యుత్ కాంట్రాక్టు బీహెచ్ఈఎల్ వశం
ఆర్థికాభివృద్ధిలో అగ్రగామిగా ఉన్న చైనా... భారత్ దెబ్బకు కుదేలైపోయింది. తాజాగా విశ్వవ్యాప్తంగా భారీ కాంట్రాక్టులు చేజిక్కించుకునే విషయంలోనూ చైనా... భారత్ తో పోటీ పడలేకపోతోంది. ఇందుకు నిదర్శనంగా బంగ్లాదేశ్ లో ఓ భారీ పవర్ ప్లాంట్ కాంట్రాక్టును దక్కించుకునేందుకు బరిలోకి దిగిన చైనా, భారత్ దెబ్బకు చిత్తయింది. భారత ప్రభుత్వ రంగ సంస్థ భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (బీహెచ్ఈఎల్) సదరు కాంట్రాక్టును కైవసం చేసుకుంది. బంగ్లాదేశ్ ప్రభుత్వం రూ.1.6 బిలియన్ డాలర్లతో కొత్తగా నిర్మించతలపెట్టిన పవర్ ప్రాజెక్టు పనుల కోసం గ్లోబల్ టెండర్లు పిలవగా... భారత్ నుంచి బీహెచ్ఈఎల్ బిడ్ దాఖలు చేసింది. అప్పటికే బంగ్లాలో పలు విద్యుత్ ప్రాజెక్టులను నిర్మించిన అనుభవంతో చైనా కంపెనీలు కూడా ఈ ప్రాజెక్టును దక్కించుకునేందుకు క్యూ కట్టాయి. అయితే చైనా కంపెనీలను వెనక్కు నెట్టేసిన బీహెచ్ఈఎల్ సదరు భారీ కాంట్రాక్టును కైవసం చేసుకుని భారత్ సత్తాను చాటింది. ఈ ప్రాజెక్టును దక్కించుకున్న బీహెచ్ఈఎల్... తన చరిత్రలోనే తొలి విదేశీ భారీ ప్రాజెక్టును చేజిక్కించుకోగా, చైనా రెండోసారి బంగ్లా టెండర్లలో బోల్తా కొట్టింది.