: అందరికీ ఇళ్లు, అభివృద్ధి... నా ప్రభుత్వ లక్ష్యమిదే: ప్రణబ్
సబ్ కే సాత్, సబ్ కా వికాస్ నినాదంతో పనిచేస్తున్న తన ప్రభుత్వం గతంలో ఇచ్చిన అన్ని హామీలనూ నెరవేరుస్తుందని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ వ్యాఖ్యానించారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా ఈ ఉదయం 11 గంటల సమయంలో ఉభయ సభలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. అంతకుముందు పార్లమెంట్ సెంట్రల్ హాల్ కు ఆయన్ను లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్, ప్రధాని నరేంద్ర మోదీ తదితరులు తోడ్కొని వచ్చారు. ప్రభుత్వం చేపట్టిన పలు సంక్షేమ పథకాలను ప్రణబ్ ముఖర్జీ తన ప్రసంగంలో ప్రస్తావించారు. "గత సంవత్సరం నా ప్రభుత్వం చేపట్టిన జన్ ధన్ యోజన అత్యంత విజయవంతమైన పథకంగా నిలిచింది. రైతులకు చేయూతనివ్వడంతో పాటు యువతలో నైపుణ్యాన్ని పెంచేందుకు కృషి చేస్తున్నాం. దేశాభివృద్ధికి దూరదృష్టితో ప్రణాళికలు రూపొందిస్తున్నాం. నిరుద్యోగులకు ఉపాధిని దగ్గర చేసేందుకు ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించాం. ఆహార భద్రత, అందరికీ నివాసం ప్రభుత్వ లక్ష్యం. భవిష్యత్తులో సొంతిల్లు లేనివారు ఉండకూడదన్న లక్ష్యంతో ప్రభుత్వం పని చేస్తోంది. ప్రాధాన్యతాంశాలను గుర్తించి వాటి సత్వర, పారదర్శక అమలు ధ్యేయంగా ముందుకు సాగుతున్నాం" అని అన్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 105వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకుని ఆయన్ను దేశమంతా మరోసారి గుర్తు చేసుకున్నదని ప్రణబ్ వివరించారు. సమాజంలో మైనారిటీలు, బడుగుల అభ్యున్నతికి గతంలో ఎన్నడూ ఇవ్వనంత నిధులను కేటాయించామని గుర్తు చేసిన ఆయన, దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నవారి సంక్షేమంతోనే ఇండియా అభివృద్ధి చెందిన దేశంగా అవతరిస్తుందని అభిప్రాయపడ్డారు.