: నక్సలైట్ కు ఐదు జీవిత ఖైదు శిక్షలు... వేలూరు ఫాస్ట్ ట్రాక్ కోర్టు సంచలన తీర్పు


ఏదైనా కేసులో జీవిత ఖైదు శిక్ష పడిందంటేనే... సదరు వ్యక్తి జీవితం ఇక ముగిసినట్లే. మరి ఒకే వ్యక్తికి ఐదు జీవిత శిక్షలు పడితే!... సంచలన తీర్పు కాక మరేమిటి? అలాంటి సంచలన తీర్పును తమిళనాడులోని వేలూరు ఫాస్ట్ ట్రాక్ కోర్టు నిన్న వెలువరించింది. విధి నిర్వహణలో ఉన్న ముగ్గురు పోలీసు అధికారులను పొట్టనబెట్టుకున్న ఓ నక్సలైట్ కు ఐదు జీవిత ఖైదు శిక్షలను విధించిన కోర్టు... దేశ న్యాయ వ్యవస్థ చరిత్రలో అరుదైన తీర్పును వెలువరించింది. వివరాల్లోకెళితే... 1970, 80 దశకాల్లో తమిళ నాట నక్సలైట్ల ప్రాబల్యం అధికంగా ఉండేది. ఈ క్రమంలో 1980, ఆగస్టు 6న తిరుపత్తూరు పరిధిలోని ఏలగిరి గిరిజన గ్రామంలో శివలింగం అనే నక్సలైట్ సహా ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. నక్సలైట్లను తీసుకెళుతున్న పోలీసు వాహనం బాంబు పేలుడుకు గురైంది. ఈ ప్రమాదంలో ఎస్సై పళనిస్వామితో పాటు ఇద్దరు కానిస్టేబుళ్లు, ముగ్గురు నక్సలైట్లు చనిపోయారు. తన వద్ద దాచుకున్న బాంబుతో శివలింగమే ఈ దాడికి దిగి, ఆ తర్వాత తప్పించుకున్నాడని దర్యాప్తులో తేలింది. దాదాపుగా 29 ఏళ్ల పాటు అజ్ఞాతంలో ఉన్న శివలింగం...2009లో వేరొక కేసులో అరెస్టయ్యాడు. వేలూరులోని సత్తువాచారి ఫాస్ట్ ట్రాక్ కోర్టులో బాంబు పేలుడు కేసు విచారణ జరిగింది. ఈ క్రమంలో విచారణను నిన్నటితో ముగించిన న్యాయమూర్తి నటరాజన్... శివలింగంను దోషిగా నిర్ధారించి ఐదు జీవిత ఖైదు శిక్షలతో పాటు బాంబులు కలిగి ఉన్నందుకు మరో పదేళ్ల జైలు శిక్షను విధించారు. అయితే అన్ని శిక్షలను ఏకకాలంలో అమలు చేయాలని న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. దీంతో ప్రస్తుతం 80 ఏళ్ల వయసున్న శివలింగంను పోలీసులు వేలూరు జైలుకు తరలించారు.

  • Loading...

More Telugu News