: కారెక్కుతున్నా!... కుండబద్దలు కొట్టిన బస్వరాజు సారయ్య
పార్టీ ఫిరాయింపుల్లో భాగంగా తెలంగాణలో మొన్న టీ టీడీపీకి... ఏపీలో నిన్న వైసీపీకి గట్టి ఎదురుదెబ్బలే తగిలాయి. తాజాగా టీ కాంగ్రెస్ వంతు వచ్చింది. గ్రేటర్ వరంగల్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ కు కాస్తంత గట్టి పోటీ ఇద్దామని భావించిన టీ కాంగ్రెస్ కు ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి బస్వరాజు సారయ్య ఝలకిచ్చారు. సారయ్యతో టీఆర్ఎస్ సంప్రదింపులు జరపడం, టీఆర్ఎస్ లో చేరేందుకు సారయ్య ఓకే చెప్పేశారన్న వార్తలు నిన్ననే గుప్పుమన్నాయి. అయితే ఈ విషయంలో నిన్న రాత్రి దాకా సారయ్య నోరు విప్పలేదు. కొద్దిసేపటి క్రితం తన మనసులోని మాటను ఆయన బయటపెట్టారు. తాను టీఆర్ఎస్ లో చేరుతున్నానని సారయ్య ప్రకటించారు. ‘‘టీఆర్ఎస్ తోనే అభివృద్ధి సాధ్యమని ప్రజలు నమ్ముతున్నారు. నేను కూడా నమ్ముతున్నాను. అందుకే టీఆర్ఎస్ లో చేరుతున్నాను. కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ లో చేరుతున్నాను’’ అని సారయ్య కొద్దిసేపటి క్రితం ప్రకటించారు.