: చదువు మీద ఆసక్తి లేకపోతే...క్రికెటర్ అవ్వండి: కపిల్ దేవ్
పిల్లలకు చదువుపై ఆసక్తి లేకపోతే క్రికెటర్ అవ్వాలని టీమిండియా దిగ్గజ ఆటగాడు, మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ పిలుపునిచ్చారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, ప్రస్తుతం క్రికెట్ ఓ గొప్ప కెరీర్ ఆప్షన్ అని అన్నారు. ఓ క్రికెటర్ 40 రోజుల్లోనే 10 కోట్ల రూపాయలు సంపాదిస్తున్నాడని ఆయన చెప్పారు. క్రికెట్ ద్వారా పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించుకునే అవకాశం రావడం శుభపరిణామమని ఆయన అభిప్రాయపడ్డారు. కాలంతో పాటు ప్రపంచ క్రికెట్ లో చాలా మార్పులు సంభవించాయని ఆయన పేర్కొన్నారు. క్రీడల పురోగతికి ప్రభుత్వమే సహకరించాలని ఆయన సూచించారు. క్రీడావస్తువులపై సుంకాలు తగ్గించడంతో పాటు, పాఠశాలల్లో మైదానాలు ఏర్పాటు చేయాలని ఆయన కోరారు.