: పరుగాపని బుల్... వరుసగా నాలుగో సెషన్ లోనూ లాభాలు
భారత స్టాక్ మార్కెట్ బుల్ పరుగు కాస్తంత నిదానించినా కొనసాగింది. మూడు వరుస సెషన్ ల లాభాలతో గతవారాన్ని ముగించిన బెంచ్ మార్క్ సూచికలు నాలుగో సెషన్ లోనూ లాభాల్లో ముగిశాయి. మొదట్లో క్రితం ముగింపు వద్దే కనిపించిన సెన్సెక్స్, నిఫ్టీ, ఆపై భారీ లాభాల దిశగా సాగినప్పటికీ, చివర్లో వచ్చిన అమ్మకాల ఒత్తిడితో స్వల్ప లాభానికి పరిమితమయ్యాయి. సోమవారం నాటి సెషన్ ముగిసేసరికి బీఎస్ఈ సెన్సెక్స్ సూచిక 79.64 పాయింట్లు పెరిగి 0.34 శాతం లాభంతో 23,788.79 పాయింట్ల వద్దకు, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచిక నిఫ్టీ 26.30 పాయింట్లు పెరిగి 0.36 శాతం లాభంతో 7,237.05 పాయింట్ల వద్దకు చేరాయి. బీఎస్ఈలో మిడ్ క్యాప్ 0.75 శాతం, స్మాల్ క్యాప్ 0.46 శాతం లాభపడ్డాయి. ఎన్ఎస్ఈ-50లో 28 కంపెనీలు లాభాల్లో నడిచాయి. హిందుస్థాన్ యూనీలివర్, బోష్ లిమిటెడ్, అల్ట్రా సిమెంట్స్, జడ్ఈఈఎల్, సన్ ఫార్మా తదితర కంపెనీలు లాభపడగా, టెక్ మహీంద్రా, ఎన్టీపీసీ, గెయిల్, మారుతి సుజుకి, అదానీ పోర్ట్స్ తదితర కంపెనీల ఈక్విటీలు నష్టపోయాయి. బీఎస్ఈలో మొత్తం 2,701 కంపెనీల ఈక్విటీలు ట్రేడ్ కాగా, 1,398 కంపెనీలు లాభాల్లోను, 1,398 కంపెనీల ఈక్విటీలు నష్టాల్లోనూ నడిచాయి. శుక్రవారం నాటి సెషన్ ముగింపు సమయంలో రూ. 88,54,658 కోట్లుగా ఉన్న బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ కాప్ సోమవారం నాడు రూ. 89,03,618 కోట్లకు పెరిగింది.