: రేపటి నుంచి 'పార్లమెంట్ యుద్ధం'... తగ్గేది లేదంటున్న కాంగ్రెస్!
దేశంలో నెలకొన్న అస్థిర పరిస్థితులు, కీలక సంస్కరణల బిల్లులు ఆగిపోవడం, హైదరాబాద్ సెంట్రల్ వర్శిటీ నుంచి జవహర్ లాల్ నెహ్రూ వర్శిటీ వరకూ నెలకొన్న విద్యార్థుల ఆందోళనలు... తదితరాల నేపథ్యంలో రేపటి నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ సమావేశాలు వాడివేడిగా జరుగుతాయనడంలో సందేహం లేదు. తమకు లభించిన ఏ అవకాశాన్నీ వదులుకునేందుకు ఇష్టపడని కాంగ్రెస్, మోదీ సర్కారును అన్ని విధాలుగా ఇబ్బంది పెట్టేందుకే నిర్ణయించుకుంది. లోక్ సభలో పూర్తి మెజారిటీ ఉన్న ఎన్డీయే సారథిగా ఉన్న మోదీ స్వయంగా తన ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు కుట్ర జరుగుతోందని వ్యాఖ్యానించారంటే, పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలను సజావుగా జరపాలన్న ఉద్దేశంతో ఇప్పటికే ప్రధాని మోదీ, పార్లమెంట్ వ్యవహారాల శాఖా మంత్రి వెంకయ్యనాయుడు విడివిడిగా అఖిలపక్ష సమావేశాలు నిర్వహించగా, నేడు స్పీకర్ సుమిత్రా మహాజన్ మరోసారి విపక్ష పార్టీలతో సమావేశం కానున్నారు. ఓ వైపు ప్రభుత్వం జీఎస్టీ, రియల్ ఎస్టేట్ బిల్లులను ఈ సమావేశాల్లో ఆమోదింపజేసుకోవాలని తన వంతు ప్రయత్నాలు సాగిస్తుండగా, వివాదాస్పద అంశాలను లేవనెత్తాలని కాంగ్రెస్ భావిస్తోంది. కాగా, ఈ నెల 25న రైల్వే బడ్జెట్, 29న సాధారణ బడ్జెట్ పార్లమెంట్ ముందుకు రానున్న సంగతి తెలిసిందే. రేపు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనుండగా, మరుసటి రోజు ఆయన ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పే కార్యక్రమం సాగనుంది. రాజ్యసభలో ఎన్డీయేకు పూర్తి మెజారిటీ లేకపోవడం మోదీ సర్కారును ఈ సమావేశాల్లోనూ ఇబ్బంది పెట్టే అంశమే. వర్షాకాల సమావేశాలతో పాటు, శీతాకాల సమావేశాల్లో సైతం మోదీ సర్కారును ఇరుకునబెట్టడంలో విజయవంతమైన కాంగ్రెస్ తదితర విపక్షాలు ఈ దఫా కూడా అదే మంత్రాన్ని ప్రయోగించనున్నాయనడంలో సందేహం లేదు.