: రూ. లక్ష దాటిన ఏపీ ప్రజల తలసరి ఆదాయం: చంద్రబాబు


ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల తలసరి ఆదాయం ఈ సంవత్సరం రూ. 1,07,532గా ఉండనుందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వెల్లడించారు. ఈ ఉదయం విజయవాడలో మొదలైన కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో ఆయన ప్రసంగించారు. వెస్ట్ గోదావరి, శ్రీకాకుళం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయని వ్యాఖ్యానించిన బాబు, ప్రభుత్వాసుపత్రుల్లో మరింత మెరుగైన వైద్యం అందాల్సి వుందని అన్నారు. 7 జిల్లాల్లో తలసరి ఆదాయం రూ. లక్షను దాటగా, కృష్ణా, విశాఖపట్నం జిల్లాల్లో రూ. 1.40 లక్షల తలసరి ఆదాయం నమోదైందని తెలిపారు. పట్టిసీమను అనుకున్న సమయంకన్నా ముందుగానే ముగించి కృష్ణా జిల్లాలో పంటలను కాపాడుకున్నామని, అదే స్ఫూర్తితో పోలవరం ప్రాజెక్టును సైతం పూర్తి చేస్తామని అన్నారు. పట్టిసీమను అడ్డుకోవాలని ప్రతిపక్షాలు పన్నిన కుట్రలకు తాము ఎదురొడ్డి నిలిచామన్నారు. వివిధ ప్రాంతాల్లో నెలకొన్న కరవును అధిగమించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో ప్రతి కలెక్టర్ సలహా, సూచనలు ఇవ్వాలని కోరారు. వర్షపు నీటిని భూగర్భ జలాలుగా మార్చాలని, ఇందుకోసం ప్రతి జిల్లాలో అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పీసీఐ ర్యాంకు గత సంవత్సరం కన్నా రెండు స్థానాలు మెరుగుపడిందని గుర్తు చేసిన చంద్రబాబు, భవిష్యత్తులో ఏపీ ఆర్థిక అసమానతలు లేని రాష్ట్రంగా తయారు కావాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని వివరించారు. పింఛన్ల మంజూరులో అవినీతికి తావివ్వద్దని, అర్హులందరికీ సంక్షేమ పథకాలను, అభివృద్ధి ఫలాలను పంచాలని కోరారు.

  • Loading...

More Telugu News