: గేటు బయట పోలీసులు... వర్సిటీ లోపల ‘రాజద్రోహ’ నిందితులు: జేఎన్ యూలో హైటెన్షన్
దేశ రాజధాని ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో నిన్న రాత్రి నుంచి మరోమారు హైటెన్షన్ వాతావరణం నెలకొంది. వర్సిటీ గేటు వెలుపల రాత్రి నుంచి పోలీసులు నిందితులను అరెస్ట్ చేసేందుకు పడిగాపులు పడుతుంటే, అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు విద్యార్థులు వర్సిటీ లోపల అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ వద్ద మోహరించి తమ వంతు యత్నాలను ముమ్మరం చేశారు. దీంతో గంటల తరబడి జేఎన్ యూలో ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది. పార్లమెంటుపై దాడి కేసులో అఫ్జల్ గురు ఉరితీతకు నిరసనగా ర్యాలీ నిర్వహించిన కొంతమంది విద్యార్థులు ర్యాలీ సందర్భంగా దేశానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీనిని ఏబీవీపీ విద్యార్థి సంఘం అడ్డుకుంది. ఈ క్రమంలో సోషల్ మీడియాలో ప్రత్యక్షమైన ఓ వీడియో వర్సిటీలో ఒక్కసారిగా ఆగ్రహ జ్వాలలను రగిల్చింది. సదరు వీడియోను పరిశీలించిన పోలీసులు వర్సిటీ స్టూడెంట్ యూనియన్ నేత కన్నయ్య కుమార్ సహా ఆరుగురిపై రాజద్రోహం కేసులు నమోదు చేశారు. ఈ క్రమంలో ఈ నెల 12న కన్నయ్య అరెస్ట్ అయిన వెనువెంటనే మిగిలిన ఐదుగురు విద్యార్థులు పరారయ్యారు. తాజాగా పరారైన ఐదుగురు విద్యార్థులు నిన్న రాత్రి వర్సిటీలో ప్రత్యక్షమయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు వర్సిటీ వద్దకు చేరుకుని వీసీకి సమాచారం చేరవేశారు. అనుమతిస్తే ఆ ఐదుగురు విద్యార్థులను అరెస్ట్ చేస్తామన్న వారి ప్రతిపాదనకు ఇప్పటిదాకా వీసీ నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. దీంతో వర్సిటీ గేట్ల వద్దే నిలిచిపోయిన పోలీసులు రాత్రి నుంచి కూడా అక్కడి నుంచి కదలలేదు. మరోవైపు కేసులు నమోదైన నేపథ్యంలో తామే కోర్టులో లొంగిపోతామంటూ, తమను అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదని విద్యార్థులు వాదిస్తున్నారు. ఈ క్రమంలో వారు వీసీతో భేటీ కోసం అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ వద్ద తమ వంతు యత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో గేటు బయట పోలీసులు, గేటు లోపల విద్యార్థులతో... అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.