: మేడారంతో తెలంగాణ ఆర్టీసీకి కోట్ల నష్టం!


జాతరలు, పుష్కరాలు, వరుస సెలవుల సందర్భాల్లో ప్రత్యేక బస్సులు నడపడం ద్వారా ఆర్టీసీ లక్షల నుంచి కోట్ల రూపాయల అదనపు ఆదాయాన్ని ఖజానాకు చేర్చుకుంటుంది. కానీ ఈ దఫా మేడారం జాతర మాత్రం ఆర్టీసీకి నష్టాలనే మిగిల్చినట్టు తెలుస్తోంది. 2014లో జాతర జరిగినప్పుడు 16 లక్షల మంది ప్రయాణికులకు సేవలందించిన ఆర్టీసీ, ఈ సంవత్సరం 18 లక్షల మందిని చేర్చినప్పటికీ, అంతకుమించిన ఖర్చు నమోదవడంతో నష్టం తప్పడం లేదు. ప్రత్యేక ప్రయాణాల కోసం వివిధ డిపోల నుంచి తెప్పించిన దాదాపు 650 బస్సులు ఖాళీగా ఉండిపోయాయి. వీటి నిర్వహణకు ప్రత్యేకంగా వచ్చిన సిబ్బందికి అదనపు వేతనాలు, వారి వసతి తదితరాల ఖర్చు ఆర్టీసీపై అదనపు భారమైంది. బస్సులు నెమ్మదిగా కదలడం వల్ల కేఎంపీఎల్ (కిలోమీటర్ పర్ లీటర్) వైఫల్యం, ఏసీ, హైటెక్ బస్సుల రిజర్వేషన్లకు పెద్దగా ఆదరణ రాకపోవడం కూడా నష్టాన్ని పెంచింది. బస్సులు పూర్తిగా నిండకుండానే నడిపించారన్న ఆరోపణలూ వచ్చాయి. మొత్తం మీద మేడారం జాతర తెలంగాణ ఆర్టీసీకి రూ. 4 కోట్ల మేరకు నష్టాన్ని మిగిల్చినట్టు సమాచారం.

  • Loading...

More Telugu News