: కెప్టెన్ కూల్ కు కోపమొచ్చింది!


మహేంద్ర సింగ్ ధోనీ... టీమిండియా కెప్టెన్ గా చాలా కాలం పాటు కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్న అతడికి కెప్టెన్ కూల్ అనే పేరు కూడా ఉంది. తన అరంగేట్రం సమయంలో జులపాల జుట్టుతో బ్యాటుతో హెలికాఫ్టర్ షాట్లతో ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడిన ధోనీ, కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత శాంతమూర్తిగా మారిపోయాడు. వెరసి కెప్టెన్ కూల్ గా మారిపోయాడు. బ్యాటుతో బాదుడుకేమీ స్వస్తి చెప్పని అతడు, జయాపజయాల్లో కూల్ గా వ్యవహరించడమే ఇందుకు కారణం. క్రికెట్ మ్యాచ్ లలో ప్రత్యేకించి టీ20 మ్యాచ్ ల్లో క్షణక్షణం నరాలు తెగే ఉత్కంఠే. అయినా, తన వ్యూహాలను కూల్ గా అమలుపరుస్తూ భారత జట్టుకు రికార్డు విక్టరీలను అతడు కట్టబెట్టాడు. టెస్టు క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత టోటల్ క్రికెట్ కే అతడు వీడ్కోలు పలకనున్నాడన్న వాదన ఇప్పుడు తెరపైకి వచ్చింది. అతడి నాయకత్వంలోని వన్డే జట్టు, టీ20 జట్టు... ఎప్పుడు ఓటమి పాలైనా రిటైర్మెంట్ ఊహాగానాలు వినిపిస్తూనే ఉన్నాయి. తాజాగా నిన్న ఆసియా కప్ కోసం బంగ్లాదేశ్ పయనమవుతున్న సందర్భంగా జరిగిన మీడియా సమావేశంలోనూ మీడియా ప్రతినిధులు అతడి రిటైర్మెంట్ ను ప్రస్తావించారు. గతంలో మీడియాపై ఎప్పుడూ ఆగ్రహం వ్యక్తం చేయని ధోనీ... నిన్న మాత్రం అసహనానికి గురయ్యాడు. తన రిటైర్మెంట్ ను ప్రస్తావించిన మీడియా ప్రతినిధిపై అతడు అంతెత్తున ఎగిరిపడ్డాడు. ఎప్పుడూ ఆ కోణం తప్ప వేరే ప్రశ్నలుండవా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. అంతటితో ఆగని అతడు ఇప్పుడప్పుడే రిటైర్ కాబోనని సదరు మీడియా ప్రతినిధికి కాస్తంత ఘాటుగానే సమాధానం చెప్పాడు.

  • Loading...

More Telugu News