: రూ. 251కు ఫోన్ అమ్మితే మాకొచ్చే లాభం ఇదే: మోహిత్ గోయల్
ప్రపంచంలోనే అత్యంత చౌక ధరకు స్మార్ట్ ఫోన్ ను ఎనౌన్స్ చేసిన రింగింగ్ బెల్స్ డైరెక్టర్ మోహిత్ గోయల్, అంత తక్కువ ధరకు ఫోన్ అమ్మినా కూడా తమకు లాభం వస్తుందని తెలిపారు. ఒక్కో హ్యాండ్ సెట్ పై తమకు రూ. 31 లాభం వస్తుందని ఆయన తెలిపారు. "నన్నెందుకు ఇలా చుట్టుముడుతున్నారు? నేను ఏం తప్పు చేశాను?" అని ప్రశ్నించిన ఆయన, "నేను గానీ, నా కంపెనీగానీ ఎప్పుడైనా ఆదాయపు పన్ను ఎగ్గొట్టిన సందర్భాలు ఉన్నాయా? నాపై ఏనాడైనా పోలీసు స్టేషన్ లో కేసులు నమోదయ్యాయా? డబ్బుతో నేను పారిపోయిన సందర్భాలు ఉన్నాయా? నేనో స్టార్టప్ కంపెనీని ప్రారంభించాను. నా వ్యాపార ప్రణాళికలు నా వద్ద ఉన్నాయి" అని ఓ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన తెలిపారు. మొత్తం 7 కోట్ల రిజిస్ట్రేషన్లు వచ్చాయని వెల్లడించిన ఆయన, తొలి బ్యాచ్ లో 25 లక్షల స్మార్ట్ ఫోన్లు అందిస్తామని, జూన్ 30 లోగా మరో 25 లక్షల ఫోన్లు సరఫరా చేసేందుకు ప్రయత్నిస్తామని అన్నారు. కస్టమర్ల నుంచి పేమెంట్ గేట్ వేల ద్వారా వచ్చిన డబ్బును తాము డెలివరీ తరువాతనే ముట్టుకుంటామని అన్నారు.