: పవన్ కల్యాణ్ కు అండగా ఉంటాం: అభిమానులు
జనసేన అధినేత, ప్రముఖ హీరో పవన్ కల్యాణ్ కు అండగా ఉంటామని ఆయన అభిమానులు అంటున్నారు. జనసేన పార్టీని దిగువ స్థాయి నుంచి బలోపేతం చేసేందుకు గాను విశాఖ పట్టణం జిల్లా వ్యాప్తంగా మార్చి 14న పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభలను నిర్వహించాలని నిర్ణయించినట్లు సమాచారం. విశాఖపట్టణంలోని శివాజీ పార్క్ లో సిటీవైడ్ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆత్మీయసభ ఈరోజు జరిగింది. జిల్లా వ్యాప్తంగా ముందుగా రిజిస్ట్రేషన్లు చేసుకున్న 300 మందికిపైగా పవన్ అభిమానులు ఈ సభకు హాజరయ్యారు. సుమారు ఆరు గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో జనసేన పార్టీ కార్యకలాపాలపై చర్చించారు. పార్టీ ఆవిర్భావ సభలను భారీ ఎత్తున నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. కాగా, జనసేన పార్టీని స్థాపించి రెండేళ్లు కావస్తోంది. జాతీయ సమైక్యత, ప్రజాధనం వ్యయానికి కాపలా, బ్లాక్ మార్కెట్ వ్యవహారాల నిర్మూలన మొదలైనవి జనసేన పార్టీ లక్ష్యాలుగా ఉన్నాయి.